‘సమ్మక్క సారక్కలపై చినజీయర్ అనుచిత వ్యాఖ్యలు- ప్రతి తెలంగాణ బిడ్డ నుంచి తిరుగుబాటు తప్పదు’

0
89

గుడి లేదు గుడి తలుపు లేదు. విగ్రహం లేదు గోపురం లేదు. మడి లేదు మైల లేదు. అర్చన లేదు అభిషేకం లేదు. ఆ మట్టిలోనే ఏ మహిమ ఉందో ఎంతటి విపత్తులు అయినా ఆ వన దేవతల మహిమ ముందు ఉత్తవే. మొన్నటికి మొన్న ఒమిక్రాన్ విజృంభణ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వ లాక్డౌన్ యోచనలో అసలు ఎలాంటి ఆజ్ఞలు లేకుండా కేవలం రక్షణ చర్యల ద్వారానే కోట్లాది మంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎలాంటి సీరియస్ పరిస్తితి తలెత్తలేదు.

అసలు కరోనానే కనుమరుగై 2 ఏళ్లుగా మూతులకు ముసుగుల బతుకు నుంచి మూవ్మాస్క్ అని ప్రభుత్వం ప్రకటించేలా పరిస్థితుల్లో మార్పులు. నిజంగా ఇది ఆ వన దేవతల మహిమ కాదా. పేరుకే గిరిజనుల ఆరాధ్య దేవతలు అయినా..నేడు ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ తెగ, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఉన్నోడు లేనోడు అన్న తారతమ్యం అసలు లేనే లేదు…చిటికెడు కుంకుమ, గుప్పెడు పసుపు చిన్న ముద్దంత బంగారం(బెల్లం) అవి కూడా తాహత ఉంటే గద్దెల పై పెట్టి రెండు చేతుల జోడించి వేడుకుంటే చాలు కష్టాలు తుడిచి కోరిన కోర్కెలు తీర్చే జనం నమ్మే వన దేవతలు. తెలంగణ పోరాట స్ఫూర్తి ప్రధాతలు ఆ అవ్వ(సమ్మక్క) బిడ్డ(సార మ్మలు). అలాంటి తెలంగాణ సబ్బండ వర్ణాల ఆరాధ్య దేవతలు వీర గిరిజన వనితలు పోరాట స్ఫూర్తి మూర్తులను అవమాన పరుస్తూ స్వామి అంటూ వేలాది శ్రీమంతులు , ఉన్నోల్లకు నామాలు పెట్టే చీన్నజీయర్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కండిస్తున్నా. సమ్మక్క సారక్కలపై చిన్నజీయర్ గారు వ్యాఖ్యలు వింటుంటే రక్తం మరుగుతుంది.

ఏంది దేవలోకం, బ్రహ్మలోకంలో పుట్టారా? మహిమలు ఉన్నయా? ఏం సాములోరు దేవలోకం , బ్రహ్మ లోకం ఎక్కడ ఉంటవి ఎప్పుడైనా చూసి వచ్చారా? దేవలోకంలో పుడితేనే దేవతలా? మరి గదే నిజం అయితే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న మీరు చెప్పే దేవలోకంలో నే పుట్టిర్రా? జై శ్రీరామ్ , జై కృష్ణ లు ఎక్కడ పుట్టారు భూలోకం లో తల్లి కడుపున పుట్టలేదు? కాషాయం కట్టినవ్ కదా గొప్పోల్లు మంచిని ప్రబోదిస్తరు అని జనం గుడ్డి గా నమ్మి వంగి వంగి దండాలు పెడుతుంటే మీరు చేసేది ఏంది సాములు. కోటీశ్వరులు కోసం పనిచేసే మీరు సామాన్యుల కోసం ఏమైనా చేశారా?మిమ్మల్ని ఎవరు తాకొద్దు అంటారు సీఎంలు ,మంత్రులు, కోటీశ్వరులు మాత్రం కౌగిలించు కోవచ్చు. మేడారం వ్యాపారం అయ్యిందా?ఏం వ్యాపారం జరుగుతుంది సామీ అక్కడ.?..టెంపుల్ సిటీ ముసుగేసి కోట్లు విలువచేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందా? కోట్లు ఖర్చు పెట్టి మూర్తులు పెట్టి టికెట్(150) పెట్టి దర్శనం అంటున్నారా? ఓ వంద , రెండు వందల ఏకరాల్లో ఒక నిర్మాణం చేసి మహిమ , భక్తి పేరుతో చుట్టూ వేల ఏకరాల్లో రియల్ భూమ్ క్రియేట్ చేసి వేల కోట్లలో దోచుకునే కుట్రలు జరుగుతున్నాయా?

దారితప్పున్న సమాజాన్ని దారిలో పెట్టేందుకు వచ్చిన సాములు అని దండాలు పెడుతుంటే మీరే దారి తప్పి ఒక రాష్ట్రం ఆచారాన్ని అవమాన పరుస్తూ కనీసం మహిళలు వీర వనితలు అన్న విజ్ఞత లేకుండా చిన్న జీయర్ గారు మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేవలం గుప్పెడు గొప్పోల్ల కోసం గొప్ప త్యాగమూర్తి సమతా మూర్తిగా మీరు చెప్పే సోల్లంతా వింటున్నారు నమ్ముతున్నారు అని నోటికి ఏది వస్తే అది వాగుతం అంటే తెలంగాణ సమాజం సహించదు. వెంటనే క్షమాపణ చెప్పాలి జీయర్ గారు. లేదంటే గిరిజనులు, దళితులు, బహుజనులు,అగ్రవర్ణాలు అన్న తేడాలేకుండా ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ నుంచి మీకు తిరుగుబాటు తప్పదు.
– ప్రదీప్ రావు ఎరబెల్లి

(రచయిత మాజీ జర్నలిస్టు, సింగరేణి ఉద్యోగి)

ఆయన ఫేస్ బుక్ వాల్ నుంచి