మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ లోని హనీఫ్ కాలనీకి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అలియాస్ కరోనా బాబా కొన్ని సంవత్సరాలుగా కాలనీలోని దర్గా వద్ద కూర్చొని ప్రజలకు మంత్రాలు వేస్తూ తాయత్తులు కడుతుండేవాడు. దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వచ్చిందని తన శిష్యులతో ప్రచారం చేసి తన దగ్గరకు వచ్చేలా చేశాడు.
అతని వద్దకు వచ్చిన అమాయకులను కోవిడ్19 బూచిగా చూసి భయబ్రాంతులకు గురిచేస్తూ వ్యాధి నయం చేస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ .30 వేల నుంచి రూ. 50 వేల వరకు కోసం చేసేవాడు. ఈ క్రమంలో అతని మాయ మాటలు నమ్మిన జనం గత రెండు రోజుల నుండి 30,40 మంది వరకు వచ్చారు.
చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మోదీ పట్నం, బోరబండ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. బాబా ఉన్న ప్రాంతంలో జనం ఎక్కువగా గుమిగూడడంతో స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై సుమోటో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.