తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడం, కొవిడ్ పరిస్థితులు తగ్గుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు దీరాయి. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తనిఖీలకు సమయం పడుతుండటంతో గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి ఉండాల్సి వస్తోంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుమలకు చేరుకున్న యాత్రికులకు అద్దె గదుల కొరత ఏర్పడింది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు భక్తులు.
అయితే నిన్న 66,763 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 33,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.29 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను రిలీజ్ చేయనుంది. మూడు నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.