తిరుపతిలో చిక్కుకున్న భక్తులకు టీటీడీ భరోసా

Do not bother the devotees: TTD

0
93

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకున్న యాత్రికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం ధైర్యం చెప్పారు. వర్షాలు తగ్గి భక్తులను తిరుమల స్వామి వారి దర్శనానికి అనుమతించే వరకు వసతి, ఆహారం ఇబ్బంది రానివ్వబోమని చెప్పారు.

భారీ వర్షం కారణంగా తిరుపతిలో ఇరుక్కున్న యాత్రికులకు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గురువారం నుంచే టిటిడి బస ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సముదాయాల్లో యాత్రికులకు అందిస్తున్న అన్నప్రసాదం, ఇతర సౌకర్యాలను శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం ఉదయం మరోమారు పరిశీలించారు.

తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాలను ఆయన పరిశీలించి సౌకర్యాల గురించి యాత్రికులను అడిగి తెలుసుకున్నారు. తిరుమలకు అనుమతించే వరకు ఇక్కడే ఉండాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆపద సమయంలో టిటిడి తమను ఆదుకున్నందుకు యాత్రికులు కృతజ్ఞతలు తెలియజేశారు. జెఈవో యాత్రికులకు అల్పాహారం పంపిణీ చేశారు.

అంతకుముందు శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయాన్ని జెఈవో పరిశీలించారు. భారీ వర్షం కారణంగా కపిలతీర్థం జలపాతం ప్రవాహం ఎక్కువగా రావడంతో దెబ్బతిన్న మండపం స్తంభాలను త్వరగా పునరుద్ధరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జలపాతం ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన గల మార్గం నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు. శ్రీ బాలాజి లింక్ బస్టాండ్, భూదేవి వసతి సముదాయాలను కూడా పరిశీలించి యాత్రికులకు ధైర్యం చెప్పారు. వారికి ఆహారం పంపిణీ చేశారు.