వెలవెలబోతున్న తిరుమల..సామాన్యులకు వెంకన్న దూరమై ఎన్ని రోజులో తెలుసా?

Do you know in how many days the backs of the common people are far away?

0
87

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉండేది. కరోనా దాటికి తిరుమల కూడా వెలవెలబోతోంది. కొవిడ్ ఉధృతి తగ్గి దేశమంతా సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నప్పటికీ నేటికీ మోస్తరు భక్తుల రద్దీతోనే కనిపిస్తోంది. తిరుమలలో తిరిగి పూర్వవైభవం ఎప్పుడొస్తుందో చూడాలి మరి.

సర్వదర్శనాలు రద్దయి సుమారు 600 రోజులు అవుతుంది. వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను యథావిధిగా టీటీడీ కొనసాగిస్తోంది. కొవిడ్ నిబంధనల పేరుతో పేద భక్తులకు మాత్రం ఉచిత దర్శనాలను దూరం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైళ్లు, బస్సులు తిరుగుతూ..సినిమా థియేటర్లు , స్కూళ్లు తెరుచుకున్న కూడా తిరుమల కొండపై నేటికీ ఆంక్షలు కొనసాగుతునే ఉన్నాయి.

సాధారణంగా తిరుమల శ్రీవారిని రోజుకు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వారాంతాలు, విశేష పర్వదర్శనాలు, సెలవు రోజులు, ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంటుంది. అయితే కరీనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గతేడాది మార్చి 20న అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు .

దాదాపు 78 రోజుల తర్వాత పరిమిత సంఖ్యతో తిరిగి దర్శనాలను మొదలుపెట్టిన టీటీడీ కొవిడ్ తగ్గే వరకు సర్వదర్శనాలను తిరిగి ప్రారంభించేది లేదని స్పష్టం చేసింది. ఏదో ఒకరకమైన దర్శన టికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతిస్తామని ప్రకటించింది. కేవలం ఆన్లైన్ ద్వారా విడుదల చేసే రూ .300 ప్రత్యేక ప్రవేశ దర్శనం , వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తూ వచ్చిన అధికారులు కొద్దిరోజుల పాటు తిరుపతిలో టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. భక్తులు గుంపుగా చేరడం ప్రమాదకరమనే కారణంతో ఆ విధానాన్ని కూడా రద్దుచేసి టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లనూ ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. దర్శనం టికెట్లు లేకుండా వస్తున్న భక్తులను అలిపిరి నుంచి వెనక్కి పంపేస్తున్నారు.

ప్రస్తుతం రూ.300 దర్శన టికెట్లు 12 వేలు, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లు 10 వేలు, వర్చువల్ ఆర్జిత సేవ టికెట్లు కొన్న 5,500 మందికి దర్శనం చేయిస్తున్నారు. అలాగే చైర్మన్ కోటాలో రూ .300 సుపథం టికెట్లు ఉన్న 1,500 మందికి , ఏడు టూరిజం శాఖలకు 3,500 టికెట్లు, సుమారు 4 వేల మంది వీఐపీ , రూ .10,500 చెల్లించే శ్రీవాణి దాతలకు దర్శనం చేయిస్తున్నారు. ఇలా రోజుకు సగటున 35 వేల మందికి స్వామి దర్శన భాగ్యం కలుగుతోంది.

కొవిడ్ కు ముందు శ్రీవారిని దర్శించుకునే వారిలో సగ భాగం ఉచిత దర్శనం భక్తులే ఉండేవారు . ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉచిత దర్శనాలు మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఆన్లైన్ ద్వారా ఇస్తున్న 10 వేల టైంస్లాట్ సర్వదర్శనాల టోకెన్లనూ హైస్పీడ్ ఇంటర్నెట్ , టెక్నాలజీపై అవగాహన ఉన్న భక్తులే పొందుతున్నారు.

ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు స్వామి దర్శనం దూరమవుతోంది. ఈ క్రమంలో కనీసం 20 వేల మందికైనా నేరుగా వచ్చేవారికి దర్శనం కల్పించాలని పలువురు టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నారు . వీరికి వ్యాక్సినేషన్ / కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ వంటి నిబంధనలు అమలుచేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.