రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాజాగా గోదావరి వరదలో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో గోదావరి నది ఒడ్డున వనదుర్గ ఆలయం ఉంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో నిన్న ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరుకుంది.
వరద తాకిడికి మధ్యాహ్నానికే ఆలయం బీటలు వారి ఓ వైపుకు ఒరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. ఆలయం నదిలో పడిపోతున్న సమయంలో గ్రామస్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కాయి.