రామ భక్తుడు హనుమంతుడు. ఆయన ఆలయాల్లో విగ్రహాలకు ఎక్కడ చూసినా కచ్చితంగా తమలపాకుల దండలు వేసి ఉంటాయి. ఆయన్ని తమలపాకులతో పూజిస్తారు భక్తులు. ఏ కోరిక కోరినా తీరుతుంది అని భక్తుల నమ్మకం. అయితే ఆంజనేయుడికి ఇలా తమలపాకులు ఎందుకు ఇష్టం అనేది ఎప్పుడైనా తెలుసుకున్నారా. సో ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ శుభం జరుగుతుందని చెబుతారు. ఇక హనుమంతుడికి ఎందుకు ఈ ఆకులు ఇష్టం అంటే? శ్రీరాముడు ఓ రోజు సేదతీరుతూ ఉన్న సమయంలో, సీతమ్మ తమలపాకు చిలుకలు రాముడికి అందిస్తుంది. ఈ సమయంలో ఆంజనేయుడు వచ్చి స్వామి మీనోరు ఎర్రగా ఎందుకు అయింది అని అడుగుతాడు.
ఈ తమలపాకులు తింటే ఇలా అవుతుందని చెబుతాడు రాముడు. అంతేకాదు ఆరోగ్యానికి మంచిది అని రాముడు చెబుతాడు. వెంటనే అడవికి వెళ్లి అక్కడ ఉన్న తమలపాకు పాదుల్ని తన ఒంటిపై వేసుకుని వస్తాడు హనుమాన్. ఇలా ఆనాటి నుంచి వాటిపై ఇష్టం పెంచుకుంటాడు హనుమాన్. అంతేకాదు ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందుకే శాంతి కావాలన్నా స్వామి అనుగ్రహం కావాలన్నా ఇలా తమలపాకులతో పూజలు చేస్తారు భక్తులు.