దసరా నాడు జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా?

Do you know why Jammi tree is worshiped on Dussehra?

0
124

దసరా నాడు జమ్మిచెట్టును (శమీవృక్షం) పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచి, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుంటారు. అనంతరం ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు. అనంతరం శమీవృక్ష రూపాన ఉన్న ’అపరాజిత’దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయ భేరీ మోగించారు.

అంతేకాదు శ్రీ రాముడు కూడా రావణునిపై దండెత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

విజయదశమి రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద గల అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని రాసిన చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇళ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు.  ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే ఐక్యతా రాగానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే జమ్మిచెట్టు అత్యంత ప్రత్యేకమైనదిగా భావించి పూజిస్తారు.

నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుడిని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘనవిజయం సాధించాడు. మహిషారుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు.