ఇలా చేస్తే తిరుమలలో విద్యుత్ ఆదా: టిటిడి ఈవో

0
81

తిరుమలలో విద్యుత్ ఆదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి  తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యుత్ ఆదా కోసం అన్ని అతిథి గృహాల్లో కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..అతిథి గృహాల్లో కొత్త విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ వినియోగంలో బాధ్యత పెరిగి, విద్యుత్ ఆదా అవుతుంది. జూన్ 1వ తేదీనుంచి విద్యుత్ మీటర్ ల రీడింగ్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా ఈవో కు వివరించారు. తిరుమల అన్నదానం కాంప్లెక్స్ లో నెడ్ కాప్ ఆధ్వర్యంలో కొత్తగా స్టీమ్ సోలార్ కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దీని ద్వారా 30 శాతం దాకా ఇంధనం ఆదా అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరగా చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తిరుమలలోని గెస్ట్ హౌస్ లు, కాటేజీల్లో రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేయడానికి గ్రీన్ కో సంస్థ ఉచితంగా సర్వే చేసి నివేదిక అందిస్తుందని ఈవో తెలిపారు.

దీని ద్వారా దాదాపు 2. 5 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. తిరుమలలో రోడ్లు మరింతగా శుభ్రపరచడం కోసం ఆధునిక రోడ్డు క్లీనింగ్ మిషన్లు తెప్పించి శుభ్రతకు పెద్ద పీట వేయాలని అధికారులను ఆదేశించారు. ఫిల్టర్ హౌస్ లతో పాటు ఇతర ప్రాంతాల్లోని 38 మోటార్లను మార్చి కొత్తవి బిగించడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని ఆయన అన్నారు.ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. తిరుపతి నుంచి తిరుమలకు విద్యుత్ బుస్సులు నడిపే విషయం గురించి ఆయన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జెఈవో సదా భార్గవి,
సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి, రవాణా విభాగం జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి, ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున, ఎలక్ట్రికల్ డిఇ శ్రీ రవి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.