ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్..ఎక్కడంటే?

0
119

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల ప్రకటన చేయగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరీక్షించుకునేందుకు మళ్లీ పుస్తకాలు తీసి సిద్ధమవుతున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే మంచి కోచింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయా? అని వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం మరో శుభవార్త వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని టీశాట్‌ అధికారులు పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ శిక్షణ అందించేందుకు సిద్దమవుతన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం టెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్‌ 4 నుంచి మే 4 వరకు మొత్తం 60 రోజుల పాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం, మధ్యాహ్నాల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల పాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు.

అంతేకాకుండా శిక్షణ ప్రారంభం చేసే కంటే ముందు వారంపాటు ప్రత్యక్షప్రసారం ద్వారా సబ్జెక్టులు, సిలబస్‌, పరీక్షా విధానం, ప్రిపరేషన్‌ టెక్నిక్స్‌పై అభ్యర్థులకు చక్కని అవగాహన కల్పిస్తామన్నారు అధికారులు.టెట్‌ అభ్యర్థుల కోసం ఏప్రిల్‌ 1 నుంచి 7 వరకు వీటిని నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ శిక్షణ తరగతులను టెట్‌ పరీక్షకే పరిమితం చేయకుండా త్వరలో గ్రూప్‌-1తో పాటు మరిన్ని పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సదరు పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి కూడా డిజిటల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సబ్జెక్ట్‌లను రికార్డింగ్‌ చేయిస్తున్నారు. నోటిఫికేషన్లు విడుదల కాగానే శిక్షణ తరగతుల వీడియోలను ప్రసారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.