‘కాలం కలిసి రాని గొప్ప జర్నలిస్ట్’

0
89

(సీనియర్ జర్నలిస్ట్ తోట బావ నారాయణ గారి వ్యాసం యధాతధంగా)

1991…ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో ప్రమోషన్ రాని కోరాడ ప్రభాకర్ అనే డాక్టర్ నిరాహార దీక్షకు దిగారు. ఆ వార్త కవర్ చేయటం ఆ రోజు నా డ్యూటీ. నేను వెళ్ళేసరికి నలుగురైదుగురు రిపోర్టర్లు అక్కడున్నారు. ఒక టెంట్ వేసుకుని మెడలో దండతో కూర్చొని ఉన్న అతగాడే ఆ డాక్టర్ అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆయన పక్కనే మా రిపోర్టర్లు కూర్చున్నారు. నేను కూడా వెళ్లి కూర్చున్నా. కాసేపయ్యాక ఇక మొదలుపెట్టమని మా వాళ్ళు సూచించటంతో ఆ డాక్టర్ తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరవు పెట్టాడు. ఆయన బాధలన్నీ చెప్పుకుంటూ పోతుంటే, విసుగుపుట్టిన రిపోర్టర్లు ఇక చాలునన్నట్టు లేచి బయలుదేరారు. ఆయన మాత్రం ఇంకా చెబుతూనే ఉన్నాడు. “నాకు ప్రమోషన్ ఇవ్వకపోతే ఇక్కడి పెద్దల బాగోతం అంతా బయట పెడతా” అన్న మాట నాకెందుకో కాస్త విచిత్రంగా అనిపించి ఆగిపోయా. “అదేంటో చెప్పొచ్చుగా.. మీకు ప్రమోషన్ ఇస్తే చెప్పరా ? ” అని అడిగితే కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

” చెప్పినా మీరు పట్టించుకోరు. వెళ్ళి నేరుగా ఆ పెద్దమనిషినే అడుగుతారు. ఆయన మీకేదో సర్ది చెబుతాడు. జరిగేది అదేగా ” అన్నాడు నిర్వేదంగా. నాక్కాస్త పట్టుదల పెరిగింది. వివరాలిస్తే తప్పకుండా వార్త రాస్తానని చెప్పా. “ఒక మహిళాపేషెంట్ మానసిక పరిస్థితి బాగానే ఉన్నా , కావాలనే ఆస్పత్రిలో ఉంచారు” అన్నాడు. ” నిజమా ? మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఊరుకున్నారు ? ” అని అడిగితే, ” ఏమో మరి.. ఇరవయ్యేళ్ళయింది ” అన్నారు చాలా నిర్లక్ష్యంగా. “అయినా , ఇప్పుడే అవన్నీ ఎందుకులెండి. నా సంగతి తేలకపోతే చూద్దాం ” అంటూ ముగించాడు. చాలా ఆశ్చర్యమనిపించింది.

ఇరవయ్యేళ్ళుగా ఆస్పత్రిలో ఉంచడమేంటి ?
అందులోనూ ఒక మహిళ… మరిన్ని వివరాలు అడగటానికి ప్రయత్నిస్తుంటే ఆ డాక్టర్ కు భయం పట్టుకుంది. ఇప్పుడు ఆ విషయం బయటికొస్తే తనమీదనే అనుమానం వస్తుందని, తన ప్రమోషన్ పూర్తిగా ఆగిపోతుందని భయపడుతున్నాడాయన. పేరు బయటకు రాకుండా చూస్తానని ఎంతగా నచ్చజెప్పినా ఆయన భయం పోలేదు. సరే, ఇప్పుడు రాయనులే అని హామీ ఇచ్చి ఆలోచిస్తూ ఆఫీసుకొచ్చా. ఆ విషయాన్ని విడిగా పరిశోధించాలనుకుంటూ ఆ ప్రస్తావన లేకుండానే వార్త రాసిచ్చా.

* * *

అప్పుడు నేను “సమయం” దినపత్రికలో పని చేస్తున్నా. నాదెండ్ల హయాంలో విద్యా శాఖామంత్రిగా పనిచేసిన మేచినేని కిషన్ రావు ఆ పత్రిక వ్యవస్థాపకులు. నాదెండ్ల వైపు వెళ్ళిన పాపానికి తెలుగుదేశం ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టి 45 రోజులకే ఆ పత్రిక మూతబడేలా చేసింది. ఆ తరువాత ఎ ఎన్ ఎస్ ( అసోసియేటెడ్ న్యూస్ సర్వీస్) నడిపే ముజీబ్ ఖాన్ ఆ పత్రికను తీసుకున్నారు. పునఃప్రారంభానికి ఒకవైపు ఏర్ఫాట్లు జరుగుతూ ఉండగా, ఈ లోపు రిపోర్టర్లు సేకరించిన వార్తలను ఎ ఎన్ ఎస్ కోసం వాడుకునేవారు. ఆ ఏజెన్సీ వార్తలను సియాసత్, రెహనుమా ఎ దక్కన్, మున్సిఫ్ సహా అనేక ఉర్దూ పత్రికలు ప్రచురించేవి. అప్పుడు ముకుందన్ సి మీనన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న కాలంలో ఆయన పనితీరు గురించి విన్న దాసరి నారాయణరావు మీనన్ ను ఉదయం ప్రారంభ సమయంలో బ్యూరో ఛీఫ్ గా నియమించారు. తెలుగు రాకపోయినా వార్తలు పసిగట్టటంలోను, సేకరించటంలోను ఆయనకు ఆయనే సాటి. ఒక విషయం గురించి మనతో మాట్లాడుతూ ఉండగానే టైప్ రైటర్ మీద ఆయన వేళ్ళు అతివేగంగా కదులుతూ ఉండేవి. మాట్లాడటం పూర్తయ్యేసరికి వార్తాకథనం పూర్తవుతుంది.

* * *

ఎ ఎన్ ఎస్ కోసం వార్త ఇంగ్లిష్ లోనే రాయాల్సి వచ్చేది. అలా ఆ రోజు కూడా వార్త ఇవ్వగానే అలవోకగా చూస్తూ, ” ఇలాంటి వాళ్లు సొంత సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ సంస్థలో లొసుగులు బయటపెడుతుంటారు ” అన్నారు మీనన్ యథాలాపంగా. నాకు ఆశ్చర్యమేసింది. “ఎలా ఊహించగలిగారు?”, మనసులో అనుకుంటూనే పైకి అనేశాను. “అవన్నీ మామూలేగా.. ఇంతకీ ఏమంటాడు ?” అన్నారు. చెప్పాలా, వద్దా అని కాసేపు తటపటాయించా. చెబితే ఆయన సొంతగా మరేదైనా పత్రికకు రాసేసుకుంటాడేమో అనే అనుమానమూ ఉంది. ఇంతకుముందు అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తప్పలేదు. చెప్పేశా. చెప్పిందంతా విని, ” అయితే రేపు ఇద్దరం వెళ్దాం. మంచి వార్త దొరుకుతుంది. మనం వస్తున్నట్టు ఆ డాక్టర్ కు మాత్రం చెప్పకు” అన్నారు ముకుందన్ మీనన్. ఏ ఆధారమూ లేకుండా అక్కడికి వెళ్ళి ఎలా పరిశోధన మొదలుపెట్టాలో ఆ రాత్రంతా ఆలోచించా. తెలిసినవాళ్ళెవరూ అక్కడలేరు. ఏమైనా, ఆయనకూడా ఆలోచిస్తారన్న ధైర్యం మాత్రం ఉంది.
ఉదయాన్నే బయలుదేరి మీనన్ గారింటికెళ్లా. ఆయన సహచరి వనజ బనగిరి ( ఆ తరువాత కాలంలో అల్లు శిరీష్ నడిపిన సౌత్ స్కోప్ సినీ పత్రిక ఎడిటర్) కి ఆయన చెప్పినట్టున్నారు. మంచి స్టోరీ అయితే నాకూ చెప్పండి అన్నారు. అప్పుడావిడ “సావీ “ కి రాసేవారు. ఆయన తరఫున నేనే సరేనని హామీ ఇస్తూ మీనన్ గారి డొక్కు చేతక్ మీద కూర్చున్నా. 11 గంటలకల్లా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి చేరుకున్నాం. అర్థగంటసేపు అంతా కలియదిరిగాం. వృథాప్రయాసే అవుతుందేమో అని అనుమానంగా ఉన్నా, అలా తిరుగుతూనే ఉన్నాం.

ఒక్కసారిగా ఆయనలో ఉత్సాహం. ఒకావిడ దూరంగా నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. ” ఆ నర్స్ మలయాళీ అనుకుంటా.. బుట్టలో వేస్తా చూడు ” అంటూ పరుగులాంటి నడకతో దూసుకు వెళ్తుంటే నేను కూడా వెంట వెళ్ళా. ఆయన మలయాళం అక్కడ అలా ఉపయోగపడుతుందని నేను కనీసం ఊహించనైనా లేదు. మలయాళంలో పలకరించగానే ఆమె మొహం చాటంతయింది. ఇద్దరూ చాలా సేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పటికి నాకు మలయాళం రాదు కాబట్టి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదుగాని అసలు విషయం అడగలేదని మాత్రం అర్థమైంది.ఒక్క సారిగా ఆమె ముఖంలో ఆందోళన…. నాకు లిప్ రీడింగ్ తెలియదుగాని సందర్భాన్నిబట్టి అర్థమవుతూనే ఉంది. ఇప్పుడే విషయం చెప్పినట్టున్నాడు. ఆమెను బాగా మొహమాటపెట్టేస్తున్నాడు. ఏదోవిధంగా ఆమెను ఒప్పించాలన్న పట్టుదల కనిపిస్తోంది. ఆమె చాలాసేపు కుదరదన్నట్టుగా ఆయనను వారిస్తోంది. దారిన పోతున్న నర్సులందరూ ఆమెను విష్ చేస్తుంటే ఆమె హెడ్ నర్స్ అని అర్థమయింది. పదిహేను నిమిషాలపాటు అలా మాట్లాడాక ఆమె నన్ను చూపించి ఏదో చెబుతోంది. వార్డ్ బాయ్, లాక్ అన్న పదాలు తప్ప నాకేమీ అర్థం కాలేదు. ఆమె చెప్పటం పూర్తయ్యాక ఒప్పుకున్నట్టుగా తలూపి మీనన్ గారు నావైపు చూశారు. నేనేమంటానోనన్నట్టు ఆమె నన్ను తదేకంగా చూస్తూ ఉంది. మీనన్ అప్పటిదాకా జరిగిన సంభాషణ సారాంశాన్ని నాకు చెప్పటం మొదలెట్టారు: ” మన ఇన్ఫర్మేషన్ కరెక్టే.. లేడీ పేషెంట్ … కానీ ఇక్కడ అన్ని విషయాలూ చాలా రహస్యమంటోంది ఆవిడ. స్టాఫ్ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ గదిలోకి వెళ్ళటం చాలా కష్టమంటోంది. నీకు వార్డ్ బాయ్ డ్రెస్ ఇస్తుందట. అది వేసుకో. గది దగ్గరికి తీసుకెళ్ళి లాక్ తీసి నిన్ను లోపలికి పంపుతుంది. బయట లాక్ చేస్తుంది. మళ్ళీ అరగంట తరువాత అక్కడ ఎవరూ లేకుండా చూసి …లాక్ తీయగానే నువ్ బయటికి రావాలి. ”

క్షణం కూడా ఆలోచించకుండా నేను సరేనన్నా.. అపరాధపరిశోధనకెళుతున్న డిటెక్టివ్ లా నన్ను నేను ఊహించుకున్నా. ఆమె తనవెంట రమ్మంది. స్టాఫ్ రూం లో ఒక బీరువా తీసి ఒక డ్రెస్స్ ఇచ్చి నన్ను వేసుకోమంది. అలాగే ఆ డ్రెస్ వేసుకున్నా. వార్డ్ బాయ్ డ్రెస్ లో నా రూపం నాకే విచిత్రంగా ఉంది. నవ్వుకున్నా. ఇక బయల్దేరమని మీనన్ చెప్పారు. ఆమె వెంట నడుస్తూ వెళుతున్నా…ఆ కాసేపు నేను వార్డ్ బాయ్ ని అనే విషయం గుర్తుపెట్టుకుంటూ. వరుసగా కొన్ని గదులకు తాళాలు వేసి ఉన్నాయి. ఒక గది దగ్గరకు రాగానే ఆగి అటూ ఇటూ చూసి తాళం తీసింది. తలుపుతీసి నన్ను వెళ్ళమంది, సరిగ్గా అరగంటలో వస్తానంటూ. నా వెనుకే తాళం వేస్తున్న శబ్దం.

గదంతా చిమ్మ చీకటి. కన్నుపొడుచుకున్నా కనిపించటం లేదు. ఒక మూలన మానవాకారం కదులుతున్నట్టు మాత్రం అర్థమవుతోంది.. దాదాపు ఇరవయ్యేళ్ళుగా బందీగా ఉన్న ఒక మహిళ… … ఎదురుగా నేను.. బయట తాళం…ఆమె మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు. ఒక్కసారిగా భయం కమ్మేసింది. క్షణాల్లో నా వార్డ్ బాయ్ చొక్కా తడిసిపోయింది. లోపల ఇంత భయపడాల్సి వస్తుందని నాలోని అపరాధ పరిశోధకుడు బైట ఉన్నప్పుడు ఊహించనేలేదు. అరగంట అక్కడే ఉండాలన్న విషయం గుర్తుకొచ్చి మానసికంగా సిద్ధమవుతూ దిక్కులు చూస్తున్నా. ధైర్యం కూడగట్టుకుంటూ చీకటికి అలవాటుపడ్డా. ఖైదీ పేషెంట్ గా మారటం తెలుసు గాని ఇక్కడ పేషెంట్ ఒక ఖైదీ.
ఏం మాట్లాడాలో, ఎలామొదలెట్టాలో అర్థం కావడం లేదు. కాళ్ళు వణుకుతున్నాయి. కానీ, ఏదో ఒకటి మాట్లాడాలని మాత్రం నా సిక్స్త్ సెన్స్ నాకు పదే పదే గుర్తుచేస్తోంది.

“భయపడకండి”. అతి కష్టమ్మీద పెద్దగా అనటానికి ప్రయత్నించానే గాని నా మాటలు నాకే వినబడక విచిత్రంగా అనిపించింది. అయినా, నేను భయపడుతూ ఆమెను భయపడవద్దని చెప్పడమేంటి ? అటువైపు నుంచి సమాధానం లేదు.

“మిమ్మల్ని ఇక్కడనుంచి విడిపించటానికి వచ్చా” అన్నాను ధైర్యం కూడగట్టుకుంటూ. నా గొంతు అపరిచితమని ఆమె గుర్తుపట్టింది. “హూజ్ దట్ ?” అంటూ మొదటి సారిగా నోరువిప్పింది. అందులో భయం ధ్వనిస్తోంది. నా భయం ఇంకా పెరిగింది. ఆమెను మంచి చేసుకోవటం తప్ప నాకు మరో మార్గం లేదు. అందుకే ధైర్యం తెచ్చుకొని నేనెవరో, నేను వచ్చిన పనేమిటో ఈ సారి ఇంగ్లీష్ లో చెప్పా. . ” నిజం చెప్పు.. నిన్నెవరుపంపారో చెప్పు.. నేను అన్నిటికీ అలవాటు పడ్డా .. అబద్ధాలెందుకు? ” ఇంగ్లీష్ లోనే అడిగింది. కాస్త వివరంగా చెప్పా. జర్నలిస్టునని చెబితే నమ్మలేనట్టు చూసింది. ఆశ్చర్యంతో కాసేపు ఆమె నోట మాట రాలేదు. ఉద్విగ్నతకు లోనైనట్టు కనిపిస్తోంది. మామూలు స్థితికి రావటానికి నాలుగైదు నిమిషాలు పట్టింది. ఆమెకు పిచ్చిలేదని నాకు నమ్మకం కుదిరింది.

మెల్లగా చెప్పటం మొదలెట్టింది.
” మాది కేరళ. నా పేరు గీతా నాయర్. మా డాడీ గోపాలకృష్ణ నాయర్ హైకోర్ట్ జడ్జ్ గా పనిచేశారు. నేను నారాయణగూడ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ ఉండేదాన్ని. డాడీ జమ్మూ కాశ్మీర్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. నా చదువుకోసం మమ్మీ, నేనూ ఇక్కడే ఉండిపోయాం. నేను ఒకతన్ని ప్రేమించాను. అతన్ని చేసుకోవటానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. నేను పట్టుబట్టాను. నాకు పిచ్చెక్కిందని 1971 సెప్టెంబర్ 22 న మా వాళ్ళు ఇక్కడ చేర్పించారు.

“అన్నట్టు.. ఇప్పుడిది ఏ సంవత్సరం?” అని అడిగింది.
1991 ఆగస్టు అని చెప్పగానే లెక్కబెట్టుకుంటూ
“నా వయసు ఇప్పుడు 40 అన్నమాట” అంది సాలోచనగా. హాయిగా గడపాల్సిన జీవితమంతా ఇలా దుర్భరంగా సాగదీశానన్న ఆవేదన ఆమె మాటల్లో ధ్వనించింది.
నేను మౌనంగా ఉండటం గమనించి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.. ” ఆ తరువాత ఆ దిగులుతో మా డాడీ పోయారని డాక్టర్లే ఒకసారి నాకు చెప్పారు. నాకు పిచ్చిలేదని చెప్పినా వినకుండా ఇక్కడే ఉంచారు. నన్ను తీసుకెళ్ళటానికి మా వాళ్ళెవరూ రాలేదని నాతో చెబుతూ వచ్చారు. అడ్రస్ దొరకలేదని, తెలుసుకుంటున్నామని కొన్ని సార్లు చెప్పేవారు. త్వరలో పంపిస్తామని నచ్చజెబుతూ నా నిస్సహాయతను ఆసరా చేసుకొని నా మీద అత్యాచారం చేశారు. ఆ రోజు నుంచి అది వాళ్ళకు అలవాటైపోయింది. ఇద్దరు డాక్టర్స్ .. ఇద్దరు వార్డ్ బాయ్స్.. వంతులవారీగా వస్తారు. ఎప్పటికప్పుడు త్వరలో డిశ్చార్జ్ చేస్తామని నమ్మబలుకుతూనే ఉన్నారు. నేను ఇక్కడే చనిపోతానని అర్థమైపోయింది.”..

కాసేపు చెప్పటం ఆపింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. జరిగిన నష్టం అంతా ఇంతా కాదు మరి…ఒక జీవితకాలం.కాసేపటికి తేరుకుని, ” నాకు ఏడుపు రావటం లేదని ఆశ్చర్యపోతున్నారా ? బండబారిపోయాను. కళ్ళలో నీళ్ళింకిపోయాయి. మీరొచ్చినప్పుడు కూడా డాక్టరో, వార్డ్ బాయో వచ్చి ఉంటాడనుకున్నా. ఇన్నేళ్లలో నాగురించి అడిగి ఇంతసేపు మాట్లాడింది మీరొక్కరే. అయినా మీరు మాత్రం నన్నెలా విడిపిస్తారు ? ఏళ్ళతరబడి ట్రాన్స్ ఫర్ కాకుండా ఇక్కడే ఉన్న డాక్టర్లు మిమ్మల్ని మాత్రం ఎలా వదిలేస్తారు ?” అని అడిగింది. శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చి ధైర్యంగా ఉండమని చెప్పటానికి ప్రయత్నించా.
తలుపు తట్టిన శబ్దం వచ్చేసరికి నా వెంట తెచ్చిన బిస్కెట్ పాకెట్ ఆమె చేతిలో పెట్టి సెలవు తీసుకున్నా.

ముకుందన్ మీనన్ దగ్గర్లోనే ఒక చెట్టుకింద కూర్చొని ఎదురుచూస్తూ కనిపించారు. ముందు ఆ డ్రెస్ తీసెయ్ అన్నారు. నా వెనుకే వచ్చిన హెడ్ నర్స్ నన్ను మళ్ళీ స్టాఫ్ రూమ్ కి తీసుకెళ్ళింది. బయటికిరాగానే, ” ఇంతకీ ఏంటి విషయం? ” అన్నట్టు నర్స్, మీనన్ నా వైపు చూస్తుంటే,
“ఆ పేషెంట్ మలయాళీ” అన్నాను. మలయాళీలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. “ఆమెకు పిచ్చిలేదు. ఇక్కడి స్టాఫ్ ఏళ్ళతరబడి ఆమె మీద అత్యాచారం జరుపుతున్నారు” అనగానే నర్స్ కంగారుపడింది. మీరిద్దరూ ఇక్కడినుంచి వెళ్ళిపోండి. నా ఉద్యోగం ఊడగొట్టేలా ఉన్నారు” అంటూ మమ్మల్ని తరిమినంత పనిచేసింది.
ఆమె కంగారు పట్టించుకోకుండా కూల్ గా ఆమెకు థాంక్స్ చెప్పి కాస్త దూరం వచ్చాం. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్దామనుకున్నాం. ఆమెను కలుసుకున్న విషయం చెబితే అక్రమంగా చొరబడ్డామంటూ మామీదనే కేసుపెట్టి అరెస్ట్ చేయించగల ఘనుడు ఆ సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామిరెడ్డి. పైగా ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి దూరపు బంధువని కూడా విన్నాం. అందుకే ఆయనదగ్గరికెళ్ళినపుడు ”మాకు తెలిసింద”ని మాత్రమే అన్నాం. అసలాయన ఆ విషయం మాట్లాట్టానికే ఇష్టపడలేదు. ఓపిగ్గా మళ్ళీ అడిగాం. డాక్టర్ ప్రభాకర్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నాడని బుకాయించాడాయన.

మహిళా పేషెంట్లను గదుల్లో పెట్టి తాళం వేస్తున్నట్టు మేం నిరూపిస్తామన్నాం. “వాళ్ళు మిగిలిన వాళ్ళ మీద దాడి చేస్తారని అలా చేశాం ” అన్నారాయన. అయినా, మిమ్మల్ని ఇక్కడివరకు ఎవరు రానిచ్చారంటూ కోప్పడ్డారు. అత్యాచారాలు జరుగుతున్నట్టు తెలిసిందన్నప్పుడు చాలా అసహనానికి గురయ్యారు ” ఒక వార్డ్ బాయ్ ని అప్పుడే సస్పెండ్ చేశాం కదా” అన్నారు. ఇంతకు మించి ఆయనతో మాట్లాడి ప్రయోజనం లేదని గ్రహించి వచ్చేశాం.

ఆఫీసుకు రాగానే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి ఒక లేఖ తయారుచేశాం. డాక్టర్ కోరాడ ప్రభాకర్ తయారుచేసిన మెమొరాండం కాపీ కూడా దానికి జతచేసి పంపాం. అప్పటికి మా పత్రిక ప్రచురణ మొదలుకాలేదు. ఇతరపత్రికలకిచ్చినా ఆ వార్తను సెన్సేషనలైజ్ చేయటమో, ఆ ఆస్పత్రి అధికారులకే విషయం లీక్ చేయటమో జరగవచ్చుననే అనుమానమూ ఉంది. వార్త కంటే ఆమెను రక్షించటం ముఖ్యం. జర్నలిజం నా వృత్తి కావచ్చుగాని అంతకంటే ముందే మనిషిగా ఆలోచించటం కనీస ధర్మమనిపించింది.
సరిగ్గా మూడురోజులు గడిచేసరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలందాయి. గీతానాయర్ ను తక్షణమే విడిపించి ఆమె కుటుంబ సభ్యులదగ్గరికి చేర్చాలన్నది ఆ ఆదేశాల సారాంశం. మొత్తం ఘటనమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆమె విడుదలరోజున మీడియా కాస్త హడావిడి చేసినా
అది ఒక్కరోజుకే పరిమితం.

సమయం పత్రిక ఎంతకీ రాలేదు. 1991 డిసెంబర్ లో గుండెపోటుతో ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో చేరి చికిత్స పూర్తయ్యాక 92 మార్చిలో మీనన్ కేరళ వెళ్ళిపోయారు. మానవహక్కుల ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. నేను చెన్నై లో సన్ నెట్‍వర్క్ లో ఉండగా సూర్య టీవీ ( సన్ గ్రూప్ మలయాళ చానల్) కి ఒక టాక్ షో చేసేవారు. అప్పుడు ఆయన నెంబర్ తెలుసుకుని ఫోన్ చేస్తే చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత 2007 లో ఒక మలయాళీ దినపత్రిక ప్రారంభించే ఏర్పాట్లలో ఉండగా తిరువనంతపురం లో ఆయన గుండెపోటుతో మరణించారు. సూర్య టీవీ న్యూస్ ఎడిటర్ సుకుమారన్ ఫోన్ చేసి చెబితే మా టీవీలో నివాళులర్పిస్తూ వార్త ప్రసారం చేశాం. చాలామంది తెలుగు జర్నలిస్టులకు మీనన్ సుపరిచితులు.

గీతానాయర్ ఇప్పుడెక్కడుంది ?
ఇది చదివినవాళ్ళు సహజంగా తెలుసుకోవాలనుకుంటారు. నేను ఆ తరువాత మద్రాస్ వెళ్ళిపోవటంతో వివరాలు తెలుసుకోలేకపోయా. కొత్త వార్త రాగానే పాత వార్త మరిచిపోవటం జర్నలిస్టులకు అలవాటేగా. దాదాపు పదేళ్ళ క్రితం ఒకావిడ ఫోన్ చేసి ” గీతా నాయర్ ని. గుర్తుపట్టారా? “అని అడిగితే నా మతిమరుపుకు క్షమాపణలు చెబుతుండగా సస్పెన్స్ కు తెరదించుతూ చెప్పేసింది. కొచ్చిలో మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు జరుగుతుంటే పనిగట్టుకొని అక్కడికెళ్ళి తెలుగు జర్నలిస్టులకు నా పేరు చెప్పి, నా నంబర్ తీసుకొని ఫోన్ చేస్తున్నట్టు చెప్పింది. అప్పట్లో ఆమె బయటికొచ్చి స్టేట్ హోమ్ లో ఉండి వివరాలు సేకరిస్తే తల్లికూడా చనిపోయిన విషయం,హైకోర్టు జడ్జిగా పనిచేసిన వాళ్ళ నాన్నగారికి ప్రభుత్వం జుబిలీ హిల్స్ లో స్థలం ఇచ్చిన విషయం తెలిశాయట. ఆ ప్లాట్ అమ్మేసి, కేరళలో బంధువులున్న కొచ్చి చేరుకుని ఒక అనాధాశ్రమం ఏర్పాటు చేసిందట.

నన్ను చూడాలనుకుంటున్నట్టు చెప్పింది…
వెళ్లాలని అనుకున్నా …
కానీ… వెళ్లలేకపోయా!