తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో కూడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 24 గంటల్లో 15 సెం.మీ పైగా వర్షపాతం నమోదు అయింది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
ఆదివారం నాడు కూడా చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలోని కొరటూరు, పెరంబూర్, అన్నాసాలై, టీనగర్, గిండి, అడయార్, పెరుంగుడి, ఓఎంఆర్‌తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలమయమైన ప్రాంతాల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పుఝల్ రిజర్వాయర్ నుండి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టుగా తిరువళ్లూరు కలెక్టర్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.