హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు..నామినేషన్ల పర్వం ప్రారంభం

0
122

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఈ క్లబ్ లో పాత్రికేయులకు సభ్యత్వం ఉంటుంది. ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి జరగనున్నాయి. వివిధ ప్యానల్ లుగా ఏర్పడి రాగద్వేషాలకు అతీతంగా జర్నలిస్టులు ఈ ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉంది.

దశాబ్దాలుగా ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తోంది ఈ ప్రెస్ క్లబ్. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులకు గురవుతూ వస్తున్న జర్నలిస్టులకు అత్యుత్తమమైన రిక్రియేషన్ సౌకర్యాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కల్పిస్తుంది. వాస్తవానికి ఈ క్లబ్ కు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఫతే మైదాన్ లో కేటాయించింది. అనంతర పరిణామాల క్రమంలో సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు హయాంలో అత్యంత విలువైన ప్రదేశంలో సోమాజిగూడలో ఈనాడు ఆఫీస్ ఎదురుగా స్థలాన్ని, భవనాన్ని కేటాయించడం జరిగింది.

వాస్తవానికి అక్కడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉండేది. దానిని ఖాళీ చేయించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జర్నలిస్టుల అవసరాల నిమిత్తం దూరదృష్టితో ఆలోచించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కేటాయించారు. ఈ క్రమంలోనే జరుగుతున్న ప్రతి ఎన్నికలలో సభ్యులు తమ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎన్నికైన పాలక వర్గాలు కూడా పక్షపాత రహితంగా సేవలను అందించడంలో వైవిధ్యాన్ని చాటుతున్నారు. ఇటీవలికాలంలో కరోనా కాటుకు పలువురు సభ్యులు బలి కావడం అత్యంత విచారకరం. ఒకవైపు రిక్రియేషన్ సౌకర్యాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అందిస్తుంది.

అదేవిధంగా సాంఘిక సేవా కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తుంది. పాస్ పోర్ట్ మేళాలు, కోవిడ్ నియంత్రణ, ఉచిత వైద్య శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను లెక్కకు మిక్కిలి సభ్యులకు అందిస్తూ వస్తుంది. హైదరాబాద్ లాంటి మెట్రో మహానగరంలో ఒక క్లబ్ లో సభ్యత్వం పొందడం అనేది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అలాంటి తరుణంలో ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఉదారతను చాటుకున్నారు. అడుగడుగునా ప్రోత్సాహం అందిస్తూ వస్తుంది. ఇందులో సభ్యత్వం కలిగి ఉండడాన్ని సగటు పాత్రికేయులు ఒక ప్రెస్టేజ్ గా భావిస్తారు.

ఈ నేపథ్యంలో తాజాగా మార్చి 13వ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అన్ని టీవీ చానెల్స్ లో పని చేసే వారు, అన్ని పత్రికల ఎడిటర్లు, స్టేట్ బ్యూరో రిపోర్టర్లు , సీనియర్ పాత్రికేయులు అందరికీ ఈ క్లబ్ లో సభ్యత్వం ఉండడం విశేషం. గెలుపు కోసం పాత్రికేయులు మినీ ఎన్నికల సంగ్రామాన్ని తలపింపజేస్తారనటంలో సందేహం లేదు. ఈ పది రోజులు మాత్రమే పోటాపోటీగా ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికలు ముగిశాక ప్రెస్ క్లబ్ లో నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ వుంటారు. రిక్రియేషన్ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. తద్వారా ఒత్తిడిని జయిస్తూ తమ ప్రస్తానాన్ని పాత్రికేయ పరంగా నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నారు.