భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని కొందరు మరణిస్తుంటే.. వరదల వల్ల అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. అనారోగ్య సమస్యతో ఒకవేళ మరణించినా..చాలా ప్రాంతాల్లో దహనసంస్కారాలు నిర్వహించలేని పరిస్థితులున్నాయి.
అలాంటి పరిస్థితే కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఇందిరానగర్ కు చెందిన జయమ్మ(70) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు చాలా అవస్థలు పడ్డారు.
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ముఖ్యంగా శ్మశానవాటికకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతింది. నీళ్లు నిలిచి మోకాళ్ల లోతు వరకు దిగబడుతోంది. ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి. జయమ్మ మృతదేహానికి దహనసంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు చివరకు ఓ ఉపాయం కనుగొన్నారు. ట్రాక్టర్ వెనుకభాగాన నాగళ్లు బిగించి..దానిపై మృతదేహాన్ని పెట్టి శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అక్కడ శాస్త్రోత్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.