మార్కెట్లలో దేశీ మిర్చి దూసుకుపోతోంది. బంగారంతో పోటీ పడి పరుగులు తీస్తోంది. ఆల్ టైం రికార్డ్ ధరతో దుమ్ములేపింది. దేశ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ ధర నమోదు చేసింది. తాజాగా మిర్చి దేశ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు ధర నమోదు చేసింది.
ఈ నెల 3వ తేదీన క్వింటాల్ మిర్చి రూ.32 వేలు అధికంగా పలకగా.. సోమవారం రోజున ఏకంగా రూ.35 వేలకు అమ్ముడు పోయింది. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డులలో.. ఒకటైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చికి భారీ ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కు చెందిన బి. రాజేశ్వర్ రావు.. మార్కెట్ కు 40 బస్తాలు తీసుకురాగా.. ఓ వ్యాపారి అత్యధికంగా క్వింటాల్ రూ.35 వేల చొప్పున కొనుగోలు చేశారు.
సోమవారం మార్కెట్ కు సుమారు 35 వేల బస్తాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. రంగులు, సుగంధ ద్రవ్యాలు, పచ్చళ్లు, నూనెలు దేశీ రకం మిర్చిని విరివిగా వాడుతుండటంతో.. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది అకాల వర్షాలు, వైరస్‌ల కారణంగా మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది కేవలం మూడు, నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. క్వింటాల్‌కు రూ.35 వేలు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.