తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించి..ఆన్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి (వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని.. జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున.. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టైంస్లాట్ టోకెన్లు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది.
కాగా జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలి.
అదేవిధంగా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి కోవిడ్ నెగిటివ్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచిస్తున్నారు. దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ.. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని చెబుతున్నారు.