రామప్ప ఆలయం..మువ్వన్నెల మురిపెం..!

Ramappa Covela..Thirty-one moons ..!

0
71

రామప్ప ఆలయం గురువారం త్రివర్ణ కాంతులతో వెలుగులీనింది. దేశంలో 100 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు..యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై కేంద్ర పురావస్తుశాఖ జాతీయ జెండా రంగులు ప్రతిబింబించేలా విద్యుత్తు దీపాలతో అలంకరించింది.

కాకతీయుల కళలకు నిలువెత్తు నిదర్శనం రామప్ప దేవాలయం. కాకతీయుల రాజధాని వరంగల్‌ ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో క్రీ.శ.1213లో కాకతీయ గణపతి దేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు.. రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు (ఏకశిల) కొలువై ఉన్నాడు. ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఈ ఆలయానికి యునిస్కో గుర్తింపు లభించింది.

ఆలయ మహామండపం మధ్య భాగాన కల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగాన నల్లని నునుపు రాతి పలకంపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా నిలిచాయి.

ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. రామప్ప ఆలయాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఇక్కడ ఆలయాని కి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.

మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు…రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయాన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు..పర్యాటకులను కట్టిపడేస్తాయి.