తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ సర్వదర్శన (ఉచిత దర్శనం) టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టికెట్లను శనివారం టీటీడీ విడుదల చేసింది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్దతిలో టీటీడీ ఈ టికెట్ల కేటాయింపు చేపట్టింది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున డిసెంబర్ నెల కోటాను టీటీడీ విడుదల చేసింది.
రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెలకు 3.10 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడం గమనార్హం. గత నెలలో 2.40 లక్షల టికెట్లను భక్తులు 19 నిమిషాల వ్యవధిలో పొందారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తారనే సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ..ఆన్‌లైన్ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. టిటిడి ఐటీ విభాగం జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ మధ్య ఎంవోయూ కుదిర్చి క్లౌడ్ టెక్నాలజీని ద్వారా ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని ఇవ్వడంపై శ్రీవారి భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి.