సాహో సైనికా-మోకాలిలోతు మంచులో గర్భిణిని మోస్తూ 6 కి.మీ నడక..

0
118

జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురిపిస్తోంది. ప్రమాదకరమైన వాతావరణంలోనూ దేశ రక్షణ విషయంలో కాంప్రమైజ్ కాని ఆర్మీ సామాన్యుల ప్రాణాలకు సైతం అదే స్థాయిలో ప్రాధాన్యమిస్తూ సహాయం చేయడంలో వెనకడు వేయలేదు.

జమ్మూ కాశ్మీర్ లో ఎమర్జెన్సీ సేవలు సైతం అతి కష్టం మీద నడుస్తున్నాయి. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో గడిచిన వారం రోజులుగా అక్కడ మంచు వర్షం కురుస్తోంది. హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. బయటకు వెళితే మోకాలు లోతు మంచుతో చుక్కలు చూడాల్సిందే. కానీ భారత సైన్యం మంచును లెక్క చేయలేదు.

అసలు ఏం జరిగిందంటే..

పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి సమీపంలో ఘజ్జర్ హిల్స్ అనే ప్రాంతం ఉంది. బారాముల్లా జిల్లా పరిధిలోకి వచ్చే ఆ చోట ఓ కుగ్రామంలో గర్భిణి మహిళకు పెద్ద కష్టం వచ్చిపడింది. నెలలు నిండిన ఆమెకు సమస్యలు తలెత్తడంతో కుటుంబీకులు సాయం కోసం అభ్యర్థించారు. మంచులో బయలుదేరిన ఆర్మీ మెడికల్ బృందం..ఆ మహిళ జాడను కనిపెట్టి వైద్యం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను సాధ్యమైనంత తొందరగా ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన మెడికల్ టీమ్ స్వయంగా గర్భిణిని భుజాలపై మోస్తూ అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చింది.

ఘజ్జర్ హిల్స్ నుంచి సలాసన్ వరకు మొత్తం 6 కిలోమీటర్ల పాటు గర్భిణిని నలుగువైపులా మోస్తూ, ఆర్మీ జవాన్ల మెడికల్ టీమ్ ఆమెను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చగలిగింది. విపరీతమైన హిమపాతం, ప్రతికూల వాతావరణంలో ఏమాత్రం చలించకుడా భారత జవాన్లు చూపిన చొరవకు స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా సురక్షితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది.