మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్.లవన్న వివరాలు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు గానూ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22వ తేదీ నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో ఎస్.లవన్న తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు.
కుటీర నిర్మాణ పథకం కింద వసతిగదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలోలాగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.