ముస్తాబవుతున్న శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రం..బ్రహ్మోత్సవాలు ప్రారంభం

0
104

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముస్తాబవుతోంది. రేపటి నుంచి భ్రమరాంబామల్లికార్జున స్వామి మ‌హా శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి బ్ర‌హ్మోత్స‌వాలకు రేపు (ఫిబ్రవరి 21వ తేదీ) 9 గంట‌ల‌కు అంకురార్పణ చేయనున్నారు.

ఈ నెల 23 నుంచి స్వామి అమ్మ‌వార్లకు వాహ‌న సేవ‌లు, గ్రామోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వాల్లో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా కరోనా నిబంధనలను పాటిస్తూ.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకూ 11 రోజుల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రికి, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులు దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికారులు ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో లవన్న సూచించారు. ఆన్ లైన్ లో రూ. 200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు రోజులు ఐదు వేలు అందుబాటులో ఉండగా.. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

తొలిరోజు 22న ధ్వజారోహణ, 23న స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భృంగివాహన సేవ, 24న హంసవాహన సేవ, 25న మయూర వాహన సేవ, 26న రావణవాహన సేవ, 27న పుష్పపల్లకి సేవ, 28న గజవాహన సేవ, మార్చి 1న నందివాహన సేవ జరగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1 రాత్రి పది గంటలకు లింగోద్భవకాల మహన్యా సపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12గంటలకు కల్యాణోత్సవ క్రతువును చేపట్టనున్నారు. 2న సాయంత్రం 4.30గంటలకు రథోత్సవం, 8.00 తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. 3న ఉత్సవాలకు పూర్ణాహుతి పలుకుతారు. ఉత్సవాల్లో చివరి రోజైన మార్చి 4న రాత్రి 7.30గంటలకు అశ్వ వాహన సేవ, 8గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలు ఉంటాయి.