“ప్రాణాలైనిస్తాం కానీ వెలిమినేడు భూములివ్వం”-రైతుల ధర్నాలు

0
90

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 192 ఎకరాలకు పైగా పేదల అసైన్డ్ భూమిని ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్కు పేరుతో తీసుకుంటుంది. నాటి ప్రభుత్వం పేదలకు సాగు చేసుకునేందుకు భూమిని కేటాయించి అసైన్డ్ పట్టాలను జారీ చేసింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాలకు పైగా రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. 2019లో అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ రైతులకు నోటిసులు జారీ చేసింది. దీంతో రైతులు తమ భూములను ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి ఉద్యమాన్ని చేశారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఆర్డీవో ఆఫీసు, కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు వినతి పత్రాలు అందించారు. అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆదినుంచి కూడా ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి వీరి పక్షాన నిలుస్తున్నారు.

పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరంకు పైగా ఉద్యమం చేయడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్ ను నిలిపేస్తున్నామని కూడా అధికారులు ప్రకటించారు. దీంతో అంతా తమ భూములకు సమస్య లేదని అనుకున్నారు. కానీ వారం రోజుల క్రితం నేరుగా రెవెన్యూ, టీఎస్ఐపాస్ అధికారులు రైతుల భూముల్లోకి వచ్చి చదును చేసే ప్రయత్నం చేశారు. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకించి వెంటనే ఆర్డీవో, జేసీని కలిసి సమస్యను మరోసారి వివరించారు. ఎకరానికి రూ.7 లక్షల నష్టపరిహారమిస్తామని, నగదు తీసుకొని భూములు అప్పగించకుంటే నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆగిపోయిన నోటిఫికేషన్ ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం గ్రామంలో 13కు పైగా ఫార్మా కంపెనీలున్నాయని, వాటి ద్వారా వచ్చే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పుడు తమ వద్ద ప్రభుత్వం భూములు తీసుకొని కోట్ల రూపాయలకు పరిశ్రమలకు అమ్మే ప్రయత్నం చేస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఎకరం భూమి మార్కెట్ ధర రూ. 1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉందన్నారు. అటువంటిది రూ.7 లక్షలకు ప్రభుత్వం తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ భూమిని ఇవ్వమని తేల్చి చెప్పారు. తమకు తాతల కాలం నుంచి వచ్చిన భూమని, తమ భూమిని తీసుకోవద్దని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంటనే తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతున్నారు. పేదల భూమి పెద్దల పాలు చేయవద్దని వారు విలపిస్తున్నారు. తమ భూమిని వదులుకోవడమంటే తమ ప్రాణాన్ని వదులుకోవడమేనని అంటున్నారు. ప్రభుత్వం పోలీసులను పెట్టి తమ భూముల పైకి వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గాలని లేకుంటే జరిగే పరిణామాలకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీఎం కేసీఆర్ లే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.