ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. సాధారణ జనజీవనం స్తంభించింది. చెన్నైలో పలు కాలనీలు, ఆస్పత్రులు నీటిమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 4 రోజుల్లో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు. చెన్నైతో పాటు..చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు.. నవంబరు 13 వరకు చెన్నై తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.