ఉద్యోగం కోసం పరుగులు పెట్టే బదులు ఇంట్లోనే శ్రమ లేకుండా సంపాదిస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి వారి కోసమే ఓ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీరు నిద్రపోతే చాలు రూ.25 లక్షలు ఇస్తాం అంటోంది. ఈ ఆఫర్ సంగతులు ఏంటో తెలుసుకుందాం..
బ్రిటన్‌లోని ఓ కంపెనీ నిద్రపోతే చాలు ‘పాతిక లక్షలు ఇస్తాం అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతిపోవడం ఖాయం. ఈ ఉద్యోగానికి చేయవలసిందల్లా రోజుకు ఆరేడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడం..విసుగ్గా అనిపిస్తే అలా టీవీలో నెట్‌ఫ్లిక్స్ చూస్తూ కాలక్షేపం చేయడమే.
ఇలా వారానికి 37.5 గంటలు గడపాలి. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలతో..ఆ కంపెనీ పరుపులు ఎలా ఉన్నాయో వారానికి ఓమారు సమీక్ష నివేదిక ఇవ్వాలి. ‘మ్యాట్రెస్ టెస్టర్’ అని గౌరవంగా పిలిచే ఈ పనికి నెల జీతం అక్షరాలా రూ.24.79 లక్షలు. అయితే ఈ ఉద్యోగావకాశం 18 ఏళ్లు నిండి, బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్లకు మాత్రమే సుమా!