తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ

0
103

తెలంగాణలో ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 29 వరకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈనెల 23 నుంచి 30 వరకు తమకు కేటాయించిన సమయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మినహా మిగతావన్నీ ఆన్​లైన్​లోనే పరిశీలించి నిర్ధారిస్తారు.

ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 17 నుంచి 21 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి విడత తర్వాత మిగిలిన ఇంజినీరింగ్ సీట్ల కోసం సెప్టెంబరు 28 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. సెప్టెంబరు 28, 29న రెండో విడత ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది.

సెప్టెంబరు 30న ధ్రువపత్రాల పరిశీలన… సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించి.. అక్టోబరు 4న రెండో విడత సీట్లు కేటాయిస్తారు. అక్టోబరు 11న తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. అక్టోబరు 11, 12న స్లాట్ బుకింగులు, 13న ధ్రువపత్రాల పరిశీలన, 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి..17న తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. మిగిలన సీట్ల కోసం అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు.