తిరుమల: సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థ

Thirumala: The best security system with technology

0
109

తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించిన‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం పనితీరు చాలా బాగా ఉందని ప్రశంసించారు. తిరుమలలోని పిఏసి-4లో గ‌ల కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను శుక్ర‌వారం ఛైర్మ‌న్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తిరుమ‌ల‌లో భ‌ద్ర‌త మ‌రియు నిఘా వ్య‌వ‌స్థ చాలా బాగుంద‌న్నారు. తిరుమ‌ల‌ను నేర ర‌హిత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు టిటిడి భ‌ద్రత సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని చెప్పారు. అంత‌కుముందు ఛైర్మ‌న్‌కు సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్ ప‌నితీరును వివ‌రించారు. కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ 24 గంట‌లు మూడు షిప్ట్‌ల‌లో పనిచేస్తునట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో అన్ని ప్రాంతాలను 1650 సిసి కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మూడవ దశలో మరో 1400 సి‌సి‌ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నట్లు వివ‌రించారు. నేరం జ‌రిగిన వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని మొబైల్ భ‌ద్ర‌తా సిబ్బంది ట్యాబ్‌కు మేసేజ్ వెలుతుంద‌ని, సిబ్బంది త‌క్కువ స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకుని నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో సిసి కెమెరాల ప‌నితీరును, శేషాచ‌ల అడ‌వుల్లోని వ‌న్య‌మృగాలు జ‌న సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సిసిటివిలో రికార్డు అయిన వెంట‌నే, అటోమేటిక్‌గా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సైర‌న్‌లు మోగి జంతువులు అడ‌విలోకి వెళ్లిపోయే విధానానం గురించి చెప్పారు.

తిరుమ‌ల‌లో ద‌ళారుల‌ను, దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డం, త‌ప్పిపోయిన వారి ఆచూకీ క‌నుగొని వారి బంధువుల‌కు అప్ప‌గించిన వీడియో క్లిపింగ్‌ల‌ను వీడియో వాల్ ద్వారా చూపించి ఛైర్మ‌న్‌కు వివ‌రించారు. ఆయన వెంట విజివో శ్రీ బాలిరెడ్డి, ఎవిఎస్వోలు శ్రీ సాయి గిరిధర్, శ్రీ పద్మనాభన్ వి.ఐ. శ్రీ ప్రతాప్, ఇత‌ర అధికారులు ఉన్నారు.