తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
ఏ సేవల ధరలు పెంచే ఆలోచన టిటిడికి లేదని… ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని.. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు. భక్తుల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ధరల పెంపు ఆలోచనను టీటీడీ విరమించుకున్నట్లు తెలుస్తుంది.
ఏప్రిల్ నుండి అన్ని ఆర్జిత సేవలను పునఃప్రారంభిస్తాం ఇప్పట్లో ఏ సేవలు, దర్శనాలు టిక్కెట్టు ధరలను పెంచే ఆలోచన టీటీడీకు లేదు. సామన్యభక్తులకు పెద్దపీట వేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన స్పష్టం చేశారు. శుక్ర, శని, అదివారాలు సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు రద్దు చేసాం.
ఏ రోజుకు ఆరోజు దర్శనం చేసుకునేలా రోజుకు 30వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులకు కేటాయిస్తున్నాం. భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించాలనేది ఆలోచన మాత్రమే. స్థానిక హోటల్ వ్యాపారులకు ఇబ్బంది కలిగించం. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు యధావిధిగా నడుస్తాయి. భక్తులకు విరివిగా అన్నప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం అని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.