నేడే ఎస్సై ప్రిలిమ్స్..ఈ నిబంధనలు గురించి తెలుసా?

0
145

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్..నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ఉద్యోగానికి ప్రాథమిక రాత పరీక్ష జరగనుంది.  554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. అంటే ప్రతి పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు.

ఈ ప్రాథమిక రాత పరీక్షకు ఈ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలలోపే చేరుకోవాలని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేస్తారని నిమిషం ఆలస్యమైన అనుమతించమని మండలి అధికారులు స్పష్టం చేశారు.

అయితే అభ్యర్థులకు ముఖ్యమైన నిబంధనలు ఇవే..

ఎస్సై ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు వాటిని ఏ4 సైజ్‌లో రెండు వైపులా (హాల్‌టికెట్‌ ఒకవైపు, వెనుక వైపు సూచనలు ) వచ్చేలా ప్రింట్‌ అవుట్‌ను తీసుకోవాలి. కలర్‌లో ప్రింట్‌ అవుట్‌ అవసరం లేదు.

ప్రింట్‌అవుట్‌ తీసుకున్న తర్వాత దానిలో ఎడమవైపు కింది భాగంలో ఇచ్చిన బాక్స్‌లో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను అతికించాలి. పిన్నులతో, గుండు పిన్నులతో ఫొటోలు పెట్టొద్దు.

పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసినలాంటిదే ఉండాలి.

ఫొటో అతికించని హాల్‌టికెట్‌తో వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించరు.

పరీక్ష కేంద్రంలోకి బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నులు అనుమతిస్తారు.

పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్‌ విధానంలో హాజరు తీసుకుంటారు. కాబట్టి, అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు పెట్టుకోకూడదు.

అభ్యర్థులు మొబైల్స్‌, ట్యాబ్లెట్లు, పెన్‌ డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, రిస్ట్‌వాచ్‌, వ్యాలెట్‌, విడి కాగితాలు వెంట తీసుకురాకపోవడమే ఉత్తమం. వీటిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.