అలిపిరి దాకా గరుడ వారధి – శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు

TTD Board meeting Updates

0
113

తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో ఈ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తిరుమల లో శుక్రవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతిలో ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. ఈ మేరకు తాను పరిశీలన జరిపినట్లు చైర్మన్ తెలిపారు.

గరుడ వారధి ఇప్పుడు ముగిసే చోటి నుంచి అలిపిరి వరకు నిర్మించడానికి కొత్తగా అంచనాలు తయారు చేయించేలా శనివారం బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కళ్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పునః ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా, కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయామన్నారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్టీ, ఎస్సీ,బీసీ, మత్స్యకార గ్రామాల్లో 500 ఆలయాలు నిర్మించాలనే నిర్ణయం కూడా కోవిడ్ వల్ల అమలు చేయలేక పోయామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. గత ఏడాదిన్నరగా కోవిడ్ వల్ల జన జీవనం ఇబ్బందిగా తయారైనా, టీటీడీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రపంచ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేలా ఆశీస్సులు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాట పర్వం పారాయణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అంశం కూడా శనివారం నాటి సమావేశంలో చర్చిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.