తిరుమల భక్తులకు టిటిడి ఈఓ విజ్ఞప్తి..అలా చేయాలని సూచన

TTD eo appeal to Thirumala devotees..suggestion to do so

0
86

తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఈఓ అధికారులతో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తిరుపతి, తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పిఏసిల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..గదుల నుంచి బయటకు వచ్చే సమయాలలో భక్తులు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ ఆదా చేసేలా సిబ్బంది వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం విశ్రాంతి గృహాలు, పిఏసీలు తదితర ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో పలు కాలేజీలకు నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామని, కొత్త మీటర్లు ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత కరెంట్ వాడకం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలన్నారు.

తద్వారా కరెంటు ఆదాపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఎస్వీబీసీ, ఇతర ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రిసెప్షన్ సిబ్బందితో పాటు ఎఫ్ఎంఎస్ సిబ్బంది కరెంట్ ఆదాపై బాధ్యత తీసుకోవాలన్నారు.

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు హాస్పిటాలిటీ వింగ్: ఈవో

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల, తిరుపతిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకంగా హాస్పిటాలిటీ వింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన విధి విధానాలతో పాటు రిసెప్షన్ విభాగంతో ఎలా సమన్వయం చేసుకోవాలి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందించాలి అనే అంశాలతో అదనపు ఈవో ఆధ్వర్యంలో సమగ్ర సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఇలు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డిఇ రవిశంకర్ రెడ్డి, తిరుమల, తిరుపతి రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.