VIPలకు టీటీడీ షాక్..

0
115

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్రమంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేశారు. మొదటగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. దేశ విదేశాల నుంచి  ప్రజలు అధిక సంఖ్యలో  తరలిరావడంతో తిరుమల కొండ భక్త జనంతో కిటకిటలాడుతోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో తెలిపారు. జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసి ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ ను పరిమితం చేశామని తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులందరికీ దైవదర్శనం కలిగే భాగ్యం కలుగుతుందని తెలిపారు.

అలాగే  క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలు ఇలా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న క్రమంలో పేదపిల్లలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా శ్రీవారి సన్నిధిలో వివాహాలు కూడా ఉచితంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.