వివిధ ఆలయాలను సందర్శించిన భార‌త ఉప‌రాష్ట్రపతి

0
89

ఆధ్యాత్మిక, చారిత్రక అనుభూతుల గురుతుచేసుకుంటూ భార‌త ఉప‌రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అయోధ్య పరిసరాలను సందర్శించడానికి, దేవుని దర్శనం పొందేందుకు అయోధ్యకు వెళ్ళాడు. స‌తీస‌మేతంగా అయోధ్య వెళ్లిన వెంక‌య్య అక్క‌డ దేవుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.  అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని దర్శించుకున్న అనంతరం, శనివారం నాడు కాశీ మహానగరాన్ని సందర్శించాను. గంగానది తీరంలో ఉన్న వారణాసి ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హైందవ భక్తకోటికి కాశీ ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం. ఇది దేవతల భూమి. భక్తి భూమి. సాంస్కృతిక సంపదతో పాటు మోక్షాన్ని అందించే ప్రదేశం. విశ్వనాథుడు కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శించడం ఆనందదాయకం.

శుక్రవారం సాయంత్రానికే వారణాసి చేరుకున్నాము. వెంటనే జీవనవాహిని అయిన గంగా హారతిలో పాల్గొనేందుకు శ్రీమతి ఉషమ్మతో కలిసి దశాశ్వమేధ ఘాట్ కి చేరుకున్నాము. గంగాహారతి వైభవం ప్రపంచ ప్రసిద్ధం. ఇది ఓ దివ్యమైన అనుభూతి. హృదయాంతరాళాల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే సందర్భంగా. దీపాలు వెలిగించడం, గంగాదేవి ఆవాహన, సంప్రదాయా నూనె దీపాలతో హారతి, గంగామాతకు నైవేద్య సమర్పణ..ఇలా ఓ క్రమపద్ధతిలో జరిగిన ఉపచారాలను మంత్రముగ్ధుణ్నై చూస్తూ ఉండిపోయాను.

ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన ఓ విషయం స్మృతిలో మెదిలింది.
పవిత్ర గంగానది హిమాలయాల్లో ఉద్భవించి, దేశంలో ప్రధాన భాగాల గుండా ప్రయాణించి, బెంగాల్ వద్ద సాగరం దరి చేరుతుంది. భారతదేశ సాంస్కృతిక ఐక్యత నీలికెరటాల ద్వారా ఉత్తమంగా చిత్రీకరించిన భావోద్వేగ బంధానికి ఈ జీవనది సజీవ సాక్ష్యం. ఈ పవిత్ర నదిని, దాని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిందిగా గంగా సేవా నిధి నిర్వాహకులు ఆర్తి కార్యక్రమానికి ముందు విజ్ఞప్తి చేయడం ఆనందాన్ని కలిగించింది.

మానవ నాగరికతకు జీవనాధారమైన నదుల్ని పరిరక్షించి, వాటికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇది మన కనీస బాధ్యత. శనివారం ఉదయం శ్రీమతి ఉషమ్మతో కలిసి పురాతన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించి,ప్రార్థించి అలౌకిక ఆనందానుభూతికి లోనయ్యాము. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం మహాదేవును పవిత్ర క్షేత్రాల్లో ప్రధానమైనది. విశ్వనాథుడు అంటే ప్రపంచానికి పాలకుడు అని అర్థం. జ్యోతిర్లింగం అంటే కాంతి స్తంభం అనే అర్థం కూడా ఉంది. ఇది పరమేశ్వరుని అనంతమైన స్వభావానికి ప్రతీక.

భారతదేశంతో పాటు ప్రపంచ ప్రజల శాంతి, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం మా దంపతులం భగవంతుణ్ని ప్రార్థించాము. కాశీ విశ్వనాథుని ఆలయం అంటే ఆధ్యాత్మిక సౌరభమే కాదు, భారతీయ సంస్కృతి సంప్రదాయా వైభవం కూడా. చరిత్రలో ఎన్నో దండయాత్రల్లో ఈ ఆలయం ధ్వంసం అయ్యింది. అయినా భారతీయులు దాన్ని తిరిగి నిర్మించుకుంటూనే వచ్చారు. ప్రస్తుతం ఆలయం 1780లో ఇండోర్ కు చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ ద్వారా నిర్మితమైంది. 1839లో మహారాజా రంజీత్ సింగ్ విరాళంగా ఇచ్చిన బంగారంతో ఆలయ రెండు గోపురాల తాపడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను సందర్శించే అవకాశం కూడా కలిగింది. కాశీ విశ్వానాథుని ఆలయం దేవాలయం మాత్రమే కాదు, మన సనాతన ధర్మానికి, మన విశ్వాసాలకు, అణచివేతలను ప్రతిఘటించిన భారతీయుల శౌర్య పరాక్రమాలకు ప్రతీక కూడా. విశ్వనాథుని దర్శనం అనంతరం వారణాసిలోని ప్రఖ్యాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించుకుని, ప్రపంచ ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు నిర్వహించాము. శివును ఉగ్ర స్వరూపానికి కాలభైరవుడు ప్రతీక. కాశీ నగరానికి క్షేత్ర పాలకుడు, రక్షకుడు ఆయనే అని ప్రతీతి.

అనంతరం వారణాసికి కూతవేటు దూరంలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మృతి స్థలాన్ని సందర్శించాము. భారతదేశ రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన వారి 63 అడుగుల విగ్రహం ముందు నిలబడడం వారి జీవితాన్ని స్ఫురణకు తెచ్చింది. యావత్ జీవితాన్ని మాతృభూమి సేవకు అంకితం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుని విగ్రహం వద్ద, 3డీ వర్చువల్ టూర్ సౌకర్యం కూడా ఉంది. దీని ద్వారా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జీవితాన్ని దగ్గరుండి చూసిన అనుభూతిని పొందవచ్చు. మా దంపతులం  ఆనందాన్ని ఆస్వాదించాము.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప తత్త్వవేత్త మాత్రమే గాక, ఉన్నత నిర్వహణ సామర్థ్యం కలిగిన ద్రష్ట, అత్యున్నత నైతిక ప్రమాణాలు కలిగిన రాజనీతిజ్ఞుడు. భారతీయ నాగరికత నైతికతకు నిలువెత్తు నిదర్శనం. వాదులాటలతో కూడిన పాశ్చాత్య భావనలకు అతీతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ఆయన, సమగ్ర మానవతా వాదాన్ని ప్రతిపాదించారు. ఇందులో బారతదేశం సనాతన జ్ఞానమే ఆలంబనగా సానుకూల మార్గంలో మన ఆలోచనలను ముందుకు తీసుకుపోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మనిషి, సమాజం, ప్రకృతి ఏకీకరణకు పిలుపునిచ్చారు.

అంత్యోదయ అంటే చివరి వ్యక్తి వరకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. గ్రామాలు, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో తపించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం, సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించేందుకు పాటు పడడమే పండిట్ జీకి మనం అందించే నిజమైన నివాళి.
వారణాసి పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖులు, అధికారులతో మాట్లాడడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో కాశీ నగరం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకునే మార్గంలో ఉందన్న విశ్వాసం కలిగింది. కాశీ ప్రజల భవిష్యత్ ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.