Flash- విరాట్ రిటైర్మెంట్..ప్రధాని, రాష్ట్రపతి ఘన వీడ్కోలు!

Virat retires, PM, President say goodbye!

0
110

గణతంత్ర దినోత్సవం వేళ ​రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ రిటైర్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని విరాట్‌’కు చేరువగా వెళ్లి.. ప్రేమగా దాన్ని నిమిరారు. ఈ గుర్రం ఇప్పటివరకు 13 సార్లు గణతంత్ర వేడుకల్లో పాల్గొంది. 73వ గణతంత్ర వేడుకల పరేడ్​ అనంతరం విరాట్​ పదవీ విరమణ పొందింది. విరాట్​కు రాజ్​పథ్​ వద్ద రామ్​నాథ్​ కోవింద్, నరేంద్ర మోదీ, రాజ్​నాథ్​ సింగ్ ఘన వీడ్కోలు పలికారు. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా విరాట్​ను చీఫ్​ ఆఫ్​ ద ఆర్మీస్టాఫ్ పురస్కారంతో సత్కరించారు.

మంచి ఎత్తు, ఆకర్షణీయమైన రూపంతో చూడగానే ఆకట్టుకునే విరాట్.. ఎంతో క్రమశిక్షణతో మెలుగుతుంది. వయసు మీదపడుతున్నా సరే.. గత ఏడాది రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రీట్రీట్ సెర్మనీలో విరాట్ అద్భుత ప్రదర్శన చేసిందని ఓ అధికారి తెలిపారు. ఇన్నేళ్లు రాష్ట్రపతి బాడీ‌గార్డ్ విభాగంలో పని చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా అది దురుసుగా ప్రవర్తించలేదు. అందుకే విరాట్‌కు వీడ్కోలు పలికే సమయంలో.. దానితో కలిసి ఏళ్ల తరబడి పని చేసిన వారంతా ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని సైతం దాన్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా నిమిరారు.

ఉత్తరాఖండ్‌లోని హెంపూర్‌లో ఉన్న రీమౌంట్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపోలో కఠోర శిక్షణ పొందిన విరాట్ మూడేళ్ల వయసులో రాష్ట్రపతి బాడీగార్డ్ విభాగంలో చేరింది. 2003లో రాష్ట్రపతి బాడీగార్డ్‌గా చేరిన దగ్గర్నుంచి ఇప్పటి వరకూ 13సార్లు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంది. రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతికి ఎస్కార్ట్‌గా వ్యవహరించడంతోపాటు.. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన దేశాల అధినేతలకు ఆహ్వానం పలికింది.