దసరా పండుగకు పాలపిట్టతో విడదీయరాని అనుబంధం ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్టకనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. అందుకే శమీ పూజ అనంతరం పాల పిట్టను చూసేందుకు ప్రజలు తహతహలాడుతారు. ఇంతకీ అసలు విజయ దశమి రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి? దాని వెనుక ఉన్న కారణమేంటి ఒకసారి చూద్దాం..
నీలం, పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపిట్టచూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు.
అంతేకాదు పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది. అప్పటి నుంచి వారి కష్టాలు తొలగిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. పాలపిట్ట కనిపించినప్పటి నుంచి పాండవులు ఏం చేసినా విజయాలే కలిగాయంట. అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.
పురాణాలు, సాంస్కృతిక పరంగా పాలపిట్టకు ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే.. దీన్ని మన రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నాం. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టనే కావడం విశేషం.