అదిగో భువనగిరి..అదిగదిగో రాయగిరి..ఆ రెండింటినీ తలదన్నేలా కనిపిస్తున్నది సూడు అదే యాదాద్రి పుణ్యక్షేత్రం. ఐదు రూపాల్లో స్వామి దర్శనమిచ్చే ప్రాంతం కావడంతో పంచ నారసింహ క్షేత్రంగా యాదాద్రి ప్రసిద్ధి చెందింది. కోట్ల మంది భక్తులు, ఎన్నో కోరికలతో విచ్చేసే ఈ యాదగిరి గుట్టకు..క్షేత్రపాలకుడిగా నిత్యం ఆ ఆంజనేయుడే అండగా నిలుస్తుంటాడు. ఏడేళ్ల క్రితం చేపట్టిన ఘనమైన దీక్ష నేడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ శ్రీరామనుజ చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం మేరకు మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వ హించనున్నారు. 7 రోజుల పాటు పంచకుండాత్మక మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకు మార్చి 21న అంకురార్పణ జరగనుంది.
ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 12 .11 గంటలకు మిధున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణంతో ముగియనున్నాయి. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానాలయం సప్తగోపురాలకు మొత్తం 125 కలశాలలను బిగిస్తున్నారు.