టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు రిషబ్ పంత్(Rishabh Pant). 2022 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత పంత్ తిరిగిరావడంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఈ ఏడాది ఆరంభంలో ఐపీఎల్‌లో అదరగొట్టినప్పటికీ.. టీ20 సరే ఏకధాటిగా గంటల తరబడి సాగే టెస్ట్ ఫార్మాట్లో రాణించగలుగుతాడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌తో టెస్టుల్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు పంత్. తొలి టెస్టులోనే పంత్ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను మునుపటి తరహాలోనే చీల్చిచండాడు. మైదానంలో పంత్ ప్రతాపం చూస్తుంటే 634 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఆటగాడేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగానే పంత్ ఆటతీరుపై వెటరన్ ప్లేయర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) పొగడ్తల వర్షం కురిపించారు.
విదేశాల్లో పంత్ ఆటతీరు మిగిలిన వారి కన్నా అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ‘‘విదేశాల్లో పంత్‌ను మించిన ఆటగాడు లేడని చెప్పగలను. కానీ భారత్‌లో మాత్రం ది బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అని మాత్రం చెప్పలేను. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పంత్(Rishabh Pant).. అత్యుత్తమ బ్యాటర్ కాగలడు. అందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పంత్ ఆడింది 58 ఇన్నింగ్సే అయినా ఆరు సెంచరీలు చేశాడు’’ అని చెప్పాడు ఆకాష్.