ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) స్టార్ ప్లేయర్, ఆలౌండర్ మహ్మద్ నబీ(Mohammad Nabi) తన కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన వన్డే కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు ముహూర్తం కూడా ఫైనల్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్ ట్రోఫీ తర్వాత తన వన్డే కెరీర్‌ను ముగించాలని యోచిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ఖారు చేశారు. నబీ తప్పుకోవడం ఆఫ్ఘన్ వన్డే టీమ్‌కు తీవ్ర లోటులా మారుతుందని, కానీ కొత్తగా వస్తున్న కుర్రోళ్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వేళ ఈ లోటును అధిగమించుకోగలుగుతామని ఆయన అన్నారు.
‘‘నబీ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడన్న వార్తలు నిజమే. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అతడు బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు. నా దృష్టికి కొన్ని నెలల క్రితమే తీసుకొచ్చాడు. అతడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టీ20ల్లో మాత్రం అతడు కొనసాగుతాడని ఆశిస్తున్నాం’’ అని నసీబ్ వివరించారు. ఇదిలా ఉంటే నబీ.. 2009లో ఆఫ్ఘనిస్థాన్ తరపు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 165 వన్డేల్లో ఆఫ్ఘనిస్థాన్ ప్రాతినిధ్యం వహించిన నబీ(Mohammad Nabi).. 3,549 పరుగులు, 171 వికెట్లు పడగొట్టాడు.