ఐసీసీ వన్డే వరల్డ్ కప్(World Cup) భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ లాభాలను తెచ్చి పెట్టనుంది. వరల్డ్ కప్ సమయంలో సుమారు రూ.22 వేల కోట్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరే అవకాశాలు ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్థికవేత్తలు ఎస్టిమేట్ చేస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ టోర్నీ నవంబర్ 15 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో దేశీయ, అంతర్జాతీయ విజిటర్స్ దేశంలో భారీ సంఖ్యలో ప్రయాణం చేయనున్నారు. పది నగరాల్లో మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ పట్టణాల్లో ఉన్న హోటల్ ఇండస్ట్రీ భారీగా ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆర్ధికవేత్తలు జాహ్నవీ ప్రభాకర్, ఆదితి గుప్తాలు అంచనా వేశారు. 2011 తర్వాత ఇండియాలో మళ్లీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతోంది. భారత్ లో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల మ్యాచ్ నిర్వహణకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
World Cup | టీవీలు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్ లు చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2019తో పోలిస్తే ఆ సంఖ్య భారీగా పెరుగనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. టీవీ, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సుమారు 12వేల కోట్లు ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ టైంలో విమాన టికెట్లు, హోటల్ రేట్స్ పెరిగాయి. వరల్డ్ కప్ వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్సు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ద్రవ్యోల్బణం 0.15 శాతం నుంచి 0.25 శాతానికి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు, టికెట్ల అమ్మకాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై జీఎస్టీ వసూళ్లతో పన్ను రాబడి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.