ఆసియా కప్(Asia Cup) టోర్నీలో భాగంగా నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్-బిలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచులో లంక బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో నజ్మల్ హుస్సేన్ శాంటో తప్పితె మరెవ్వరూ రాణించలేదు. శాంటో 122 బంతుల్లో 7 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ 20 పరుగులు చేశాడు. బంగ్లా జట్టులో ముగ్గురు డకౌట్ కావడం గమనార్హం.
ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. శ్రీలంక పేస్ బౌలర్, జూనియర్ మలింగగా పిలవబడే మతీష పతిరణ 4 వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 2, ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లాలగే , కెప్టెన్ దసున్ షనక తలా ఓ వికెట్ తీశారు. ఇక బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగిన పాక్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండ్ ప్రదర్శనతో దాదాపు 230 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
Asia Cup | టోర్నీలో భాగంగా యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. తొలి మ్యాచ్ లో నేపాల్ జట్టుపై భారీ విజయంతో ఊపు మీదున్న పాక్ భారత్‌పై కూడా గెలవాలని తహతహలాడుతోంది. మరోసారి పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చేందుకు రోహిత్ సేన రెడీ అవుతుంది. మొత్తానికి ఎప్పటిలాగే ఈసారి దాయాది దేశాల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.