కరోనా కారణంగా గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగలేదు. అలాగే IPL మ్యాచ్ లకు భాగ్యనగరం వేదిక కాలేదు. ఇక మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్ వేదికగా మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్.
చాలా కాలం తర్వాత ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అది టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫెవరెట్లు అయిన టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో మళ్లీ ధనాధన్ టీ20 మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ భారీగా తరలిరానున్నారు. సెప్టెంబర్ 25న (ఆదివారం రాత్రి) జరగబోయే ఈ మ్యాచ్ వీక్షించడానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు పేటీఎం యాప్ లో అందుబాటులో ఉన్నాయి. అందులోనే టికెట్ రేటు, ఎలా బుక్ చేసుకోవాలో ఉంది. అయితే ఇది డిజిటల్ టికెట్ అని, ఫిజికల్ టికెట్ కావాలంటే ఈ రెండు రోజుల్లో సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ముందుగా డిజిటల్ టికెట్ తీసుకుంటేనే ఫిజికల్ టికెట్ ఇవ్వనున్నారు.
అయితే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే మాత్రం తప్పనిసరిగా ఫిజికల్ టికెట్ ఉండాలి. లేకుంటే మ్యాచ్ ను చూడలేరు. అభిమానులు మాత్రం టికెట్లు ఎక్కడ దొరుకుతాయని గందరగోళంలో ఉన్నారు. పేటీఎంలో డిజిటల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది బుక్ చేసుకున్న తర్వాత సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో ఫిజికల్ టికెట్ తీసుకోవడం తప్పనిసరని తెలుస్తుంది.