చెస్ ఒలిపింయాడ్లో(Chess Olympiad) భారత జట్లు అదరగొట్టాయి. దశాబ్దాలుగా ఉన్న లోటును మన క్రీడాకారులు పూడ్చారు. చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. చదరంగం అదే చెస్‌కు భారత్ పుట్టినిల్లు. ఈ క్రీడలో ఎన్నో టైటిళ్లు భారత్ సొంతం. కానీ చెస్ ఒలిపింయాడ్ లో మాత్రం దశాబ్దాల పోరాటమే తప్ప.. పసిడి దక్కలేదన్న లోటు మిగిలిపోయింది. ఆ లోటునే ఇప్పుడు యువతరం ప్లేయర్లు పూడ్చేశారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన స్వర్ణ పతాకం సొంతం చేసుకున్నారు. పురుషులు, మహిళలు రెండు జట్లు కూడా చెస్ ఒలింపియాడ్లో తమ పర్ఫార్మెన్స్‌తో ఔరా అనిపించాయి. ఈ చారిత్రాత్మక విజయాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అర్జున్ ఇరిగేశి(Arjun Erigaisi), పెంటేల హరికృష్ణ(Pentala Harikrishna), ద్రోణవల్లి హారిక(Dronavalli Harika) కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించారు.
Chess Olympiad | ఓపెన్ విభాగంలో భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో పసిడిని కైవసం చేసుకున్నారు. చివరిదైన 11వ రౌండ్లో 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తు చేసింది భారత్. అమ్మాయిల జట్టు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌భైజాన్ ఓడించేసింది. ఓపెన్‌లో 10 రౌండ్లు ముగిసే సరికి భారత్ 19, చైనా 17 పాయింట్లతో టాప్ స్థానాల్లో నిలిచాయి. ఆఖరి రౌండ్లో కూడా భారత్ పురుషులు, మహిళ జట్లు రెండూ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచారు.