Engalnd Ex spinner manti panesar comments On India Cricket team: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారత జట్టు సభ్యులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని మినహాయిస్తే.. జట్టులో ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు. టీ20 పోరులో టీమ్ ఇండియా ఆశించిన స్థాయిలో పోటీనివ్వలేకపోయిందన్నారు. భారత జట్టు బౌలింగ్ జోస్ బట్లర్, హేల్స్ వంటి ఆటగాళ్ల ముందు తేలిపోయిందని అభిప్రాయపడ్డారు. 168 స్కోర్ అనేది తక్కువ కాకపోయినా.. సెమీస్‌లో గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వటానికి ఇదే మంచి సమయం కాబట్టి.. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, అశ్విన్ టీ20 లకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందన్నారు. కచ్చితంగా ఈ ముగ్గురు ఆటగాళ్లను మేనేజ్‌మెంట్ పిలిచి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉందన్నారు.
విరాట్ మంచి ఫామ్‌లో ఉన్నాడని మాంటీ పనేసర్ కితాబునిచ్చాడు. విరాట్‌కు వయసు ఒక నెంబర్ మాత్రమేనని.. అందరికన్నా గొప్ప ఫిట్‌నెస్ అతని సొంతం అని అన్నారు. 2024లో రోహిత్, అశ్విన్, డీకేలకు జట్టులో ఉండరని అనుకుంటున్నాను అని మాంటీ అన్నాడు. ఈ ముగ్గురూ టెస్టులు, వన్డేలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని మాంటీ పనేసర్ తెలిపారు.
భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ కోసం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లాండ్ చేతిలో సెమీ ఫైనల్ ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్, అశ్విన్, షమీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్ల ఫామ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీరంతా టీ20లో అంతగా రాణించకపోవటం.. పైగా ప్రత్యర్థి జట్టును కట్టడి చేయటం విఫలం అవుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వీరంతా టీ20లకు రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో మాంటీ పనేసర్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.