టీమిండియా హెడ్ కోచ్‌గా పూర్తి పదవీ కాలాన్ని ముగించుకోవడం గంభీర్(Gautam Gambhir)కు కష్టమేనంటూ భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ హాట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా టీమ్‌కు కోచ్‌గా గంభీర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. జట్టులోని అందరితో గంభీర్ కూడా కలిసిపోయే కనిపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో జోగిందర్ శర్మ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక్కసారిగా శర్మ ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు. అంత అవసరం అతనికి ఎందుకు వచ్చిందంటూ చర్చ మొదలైంది. కాగా మరోవైపు జోగిందర్ చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ జోగిందర్ ఏమన్నాడంటే..
‘‘భారత హెడ్ కోచ్ పదవిలో గంభీర్(Gautam Gambhir) ఎక్కువ కాలం కొనసాగడం డౌటే. అతడిపై నాకు కోపమో, ఈర్ష్యో లేదో. గంభీర్ గురించి నాకు, అందరికీ తెలిసిన విషయాలే అందుకు కారణం. గంభీర్ అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఒక్కోసారి జట్టు సభ్యుల అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. అదే విధంగా అతడి ముక్కుసూటితనం కూడా. ఈ ఏదున్నా నిర్మోహమాటంగా ముఖంపైనే మాట్లాడేస్తాడు. ఎదుటివారిని పొగడ్తలతో బుట్టలో వేసుకుందాం అన్న ఆలోచన ఉండదు. అది అతడి స్టైల్ కూడా కాదు. అందుకే కోచ్‌గా పూర్తి పదవీకాలాన్ని గంభీర్ ముగిస్తాడని అనిపించడం లేదు’’ అని అన్నాడు.