టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. 2012లో భారత టీ20 లీగ్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత ఇప్పటి వరకు బ్యాట్ పట్టలేదు సౌరవ్ గంగూలీ. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత పాలనాపరమైన బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చాడు.
అయితే తాజాగా వచ్చే ఎల్‌ఎల్‌సీ సీజన్ భారత్‌లోనే జరగనుంది. ఈ క్రమంలో ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు గంగూలీ సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోను మాజీ సారథి ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫండ్ రైజింగ్ కోసం ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుండటం బాగుంది. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నా. దిగ్గజాలు ఆడే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగం కాబోతున్నా. త్వరలోనే క్రికెట్ బంతిని ఎదుర్కోబోతున్నా” అని గంగూలీ పోస్టు పెట్టాడు. దాదా ఆడటంపై లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా అధికారికంగా వెల్లడించారు. “దిగ్గజ ఆటగాడు సౌరభ్ గంగూలీకి ధన్యవాదాలు. ఇతర లెజెండ్స్‌తో ఆడేందుకు ముందుకు వచ్చిన దాదాకు కృతజ్ఞతలు. ప్రత్యేక కారణం కోసం గంగూలీ మ్యాచ్ ఆడబోతున్నారు. గంగూలీకే సాధ్యమైన కొన్ని షాట్లను చూసే అవకాశం ప్రేక్షకులు, అభిమానులకు దక్కనుంది” అని రహేజా వెల్లడించారు.