న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆఖరికి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్ట్‌లలో పరాజయం పాలైన భారత్ ఈసారి ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం టీమ్ రకరకాల వ్యూహాలను కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూడో టెస్ట్ కోసం ఓ స్పెషల్ బౌలర్‌ను కూడా రంగంలోకి దించడానికి రెడీ అయింది టీమిండియా. అతడే యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana). ఈ కుర్రాడితో న్యూజిలాండ్ బ్యాటర్ల చేత మూడు చెరువు నీరు తాగించాలని భారత్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. హర్షిత్ రాణా.. న్యూజిలాండ్(New Zealand)తో జరిగే మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీలో అసోం తరుపున ఆడటం కోసం హర్షిత్.. టీమిండియా నుంచి రిలీవ్ అయ్యాడు. ఢిల్లీ తరపున అసోంతో తలపడిన హర్షిత్.. ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు ఎనిమిది స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 50 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతడి పర్ఫార్మెన్స్ కారణంగా భారత జట్టులో అతడికి స్థానం దక్కింది.
ఎదురుగా ఎంతటి బ్యాటర్ ఉన్నా ఏమాత్రం జంకకుండా పదునైన బౌలింగ్ వేసే నైపుణ్యం, వికెట్లు పడగొట్టే నేర్పరితనం హర్షిత్ సొంతం. ఒత్తిడి సమయాల్లో సైతం తన బౌలింగ్‌లో పదును పోకుండా చూసుకోవడమే కాకుండా వికెట్లు పడగొట్టి జట్టును విజయం దిశగా తీసుకెళ్లడంలో హర్షిత్ ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. 2024 ఐపీఎల్‌లో హర్షిత్.. కోల్‌కతా తరుపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ట్రోఫీ గెలవడంలో కూడా హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. 11 ఇన్నింగ్స్‌లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టు ప్రత్యర్థులను హడలెత్తించాడు. అందుకే టీమిండియాకు హర్షిత్(Harshit Rana) ఒక సీక్రెట్ వెపన్‌లా చాలా స్పెషల్ అయ్యాడు.