జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్(Heath Streak) బతికే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి స్ట్రీక్ మరణించారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తంచేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే స్ట్రీక్ మరణించలేదని సహచర అటగాడు హెన్రీ ఒలంగా క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. “హీత్ స్ట్రీక్ మరణించారనే వార్తలు ఎక్కువయ్యాయి. నేను ఇప్పుడే అతడితో మాట్లాడాను. మూడో అంపైర్ మళ్లీ వెనక్కి పిలిచాడు. స్ట్రీక్ బతికే ఉన్నాడు” అంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. ఈ ట్వీట్‌కు స్ట్రీక్‌తో చేసిన వాట్సాప్ చాట్ కూడా షేర్ చేశాడు.
అసలు స్ట్రీక్(Heath Streak) మరణించారని తొలుత ఒలంగానే ట్వీట్ చేశారు. దీనికి మరో ఆటగాడు సీన్ విలియమ్స్ కూడా మీరు, మీ కుటుంబ సభ్యులు నాకు ఎంత సహాయం చేశారో చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని తెలిపాడు. ఇప్పుడు మళ్లీ ఒలంగానే స్ట్రీక్ బతికి ఉన్నారని మరో ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు ఒలంగాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి స్ట్రీక్ బతికి ఉన్నారని క్లారిటీ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రపంచ క్రికెట్‌లోనే బెస్ట్ ఆల్‌రౌండర్‌గా స్ట్రీక్ పేరు తెచ్చుకున్నాడు. 1993లో పాకిస్థాన్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన స్ట్రీక్.. 12 సంవత్సరాల పాటు జింబాంబ్వే జట్టుకు సేవలందించారు. 2000 నుంచి 2004 మధ్య జింబాంబ్వే జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. కెరీర్‌లో మొత్తం 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేశారు. ఇక టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు.