Olympics 2024 | ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తన ఖాతా తెరిచింది. షూటింగ్‌లో యువ షూటర్ మను భాకర్(Manu Bhaker) తన సత్తా చాటి ఈ ఒలిపింక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య సాధించి దేశం గర్వపడేలా చేసింది మనుభాకర్. అంతేకాకుండా ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా మను రికార్డు సృష్టించింది. ఆమెకు దేశ ప్రజలంతా అభినందనలు తెలుపుతున్నారు. తాను పతకం సాధించడంపై మను భాకర్ సంతోషం వ్యక్తం చేసింది. తన 12 ఏళ్ల నిరీక్షణ ఈరోజు నెరవేరిందని చెప్పారు.
10మీటర్ల ఎయిర్ పిస్టల్ గేమ్స్ ఫైనల్‌లో దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ 243.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం, కిమ్ యేజే 241.3 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకున్నారు. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న మను భాకర్(Manu Bhaker) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇదే విభాగం పురుషుల పోటీలో భారత మరో షూటర్ సందీప్ సింగ్.. 629.3 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.