ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన ఐపీఎల్ ఫైనల్ గేమ్

-

IPL Final 2023|క్రికెట్ గేమ్ ఆఫ్ ఇంచెస్.. అన్ ప్రెడిక్టబుల్ గేమ్.. అంతేనా.. అందరూ చాలా కాలంగా వాడుతున్న పదాలే ఇవి. కానీ క్రికెట్ ఈ రాత్రి ఏడ్చింది. ఏడిపించింది. నవ్వించింది. నవ్విస్తూ కూడా కన్నీళ్లు తెప్పించింది. ఏం గేమ్ రా నాయనా ఇది. ఏం నాటకీయత రా తండ్రీ ఇది. గుజరాత్ టైటాన్స్ ఓడిందా.. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందా. ఏమో మరి. అంతిమంగా నరాలు తెగే ఉత్కంఠను రేపుతూ చివరి క్షణంలో క్రికెట్ గెలిచింది. మొహాలీ మైదానంలో ఐపీఎల్ గెలిచింది.

- Advertisement -

కళ్లు మూసుకున్న ధోనీ

క్రికెట్ గెలిచింది. మొతేరా విలపించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఏడుస్తూనే చివరిక్షణంలో నవ్వింది. మొహిత్ సేన్ ఏడ్చాడు. అంబటి రాయుడు ఏడ్చాడు. ఫైనల్ ఓవర్ చివరి రెండు బంతుల ఆట మిగిలి ఉండగా, ఇక సీఎస్కే పనయిపోయింది అని అందరూ భావించిన క్షణంలో సీఎస్కే కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ గేమ్ చూడలేక కళ్లు మూసుకున్నాడు. రెండు బంతుల్లో పది రన్స్ తీయాలి. మూడు వరుస యార్కర్లతో చెన్నై బ్యాట్స్‌మన్‌కి షాకింగ్ ఇస్తూ కట్టడి చేసిన మొహిత్ శర్మ వీర బౌలింగ్‌లో జడేజా తొలి సిక్స్‌తో మొతేరా మోగింది. జనాకాశం దద్దరిల్లింది. కానీ ధోనీ కళ్లు తెరవలేదు. దానర్థం మ్యాచ్ గెలవడం కష్టమనే అపనమ్మకమే కావచ్చు. ఏం జరిగినా తాను ప్రత్యక్షంగా చూడను అని నిర్ణయించుకుని ఉండవచ్చు. చివరిబంతిని వేశాక మొతేరా స్టేడియంలో జనఘోష వినిపించి కళ్లు తెరిచిన ధోనీకి విజయగర్వంతో గ్రౌండ్‌ని చుట్టేస్తున్న జడేజా కనిపించాడు. అప్పుడు మాత్రమే తన కన్నీటిపొర కరిగిపోయి ఉంటుంది. ఒక్క క్షణంలోనే తేరుకున్నాడు. యథాప్రకారం డగౌట్‌లో పక్కన ఉన్నవారితో చేతులు కలుపుతూ నవ్వాడు. జయాపజయాలను యోగిలా స్వీకరించడం ఆధునిక క్రీడాచరిత్రలో ధోనీకి కాక మరెవరికి సాధ్యం?

జడేజాను ఎత్తిలేపిన ధోనీ.. ఇదే తొలిసారి

ఉత్కంఠకే ఉత్కంఠ కలిగిన ఆ ఉద్విగ్న క్షణంలో… చివరి బంతికి ఫోర్ కొట్టిన జడేజా ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం పరుగెత్తాడు. అప్పుడు మరోసారి తన కళ్లముందు అద్భుతాన్ని తిలకించిన మొతేరా స్టేడియం స్థానిక జట్టు ఓడినందుకు ఏడ్చింది. అదే సమయంలో క్రికెట్ గెల్చినందుకు పరమానందంతో నవ్వింది. ఐపీఎల్ 15 సంవత్సరాల చరిత్రలో ఏరోజూ ఉద్వేగాన్ని బయటకు కనిపించనివ్వని ధోనీ, విజయానందంతో తన వద్దకు పరుగెత్తుకొచ్చిన జడేజాను ఒక్కసారిగా హత్తుకుని పైకి లేపినప్పుడు చూస్తున్న కోట్లాదిమంది ఆనందంతో ఏడ్చారు. వాళ్లు కార్చిన కన్నీళ్లు ఆనందాశ్రువులు మాత్రమే.

I’m very happy for him [Dhoni]. Destiny had this written for him. If I had to lose, I don’t mind losing to him. Good things happen to good people.

IPL Final 2023|ఇది గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫైనల్లో తనకు అడ్డుకట్టలేసిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ధోనీని చూసి సంతోషిస్తున్నానన్నాడు. విధి ఈరోజు ఆటను ధోనీకోసం లిఖించిందన్నాడు. ధోనీ చేతుల్లో ఓడిపోయినందుకు ఏమాత్రం బాధపడను అన్నాడు. మంచి వ్యక్తులకు మంచే జరుగుతుందన్నాడు. దూకుడుగా, నిర్లక్ష్యంగా, అహంభావంతో కనిపించే హార్దిక్ పాండ్యా ఇలా ప్రత్యర్థి గురించి వినమ్ర ప్రకటన చేసినందుకు మొతేరా స్టేడియం విస్తుపోయి మూగపోయింది.

క్యురేటర్ ఏడ్చాడు

అందరికంటే ఎక్కువగా మొతేరా క్యురేటర్, గ్రౌడ్ సిబ్బంది ఏడ్చారు. వర్షానికి తడిసి ముద్దయిన స్టేడియంని రెండు గంటల వ్యవధిలో తడారబెట్టి తిరిగి ఆడేందుకు వీలుగా తమవంతుగా మహనీయ మాన్య కృషి చేసిన గొప్ప మనుషులు వారు. తాము తయారు చేసిన స్టేడియంలో ఈరాత్రి ఒక చరిత్ర నిర్మాణమవుతుందని, ప్రపంచ కప్‌ని మించిన ఉద్వేగం, ఉత్కంఠ నెలకొంటుందని తెలియని ఆ శ్రమైక జీవులు ఆ మహత్తర చరిత్రలో భాగమైనందుకు కరువు తీరా ఏడ్చారు. శోకమూ ఆనందమూ కలగలిసిన మానసిక స్థితిలో వారు మూగపోయి నిలబడ్డారు.

చివరి ఏడుపు రాయుడిదే

ఇదే తన చివరి ఐపీఎల్ యూటర్న్ అయ్యే సమస్యే లేదు అన్న హైదరాబాదీ ఆటగాడు రాయుడు జీవితాంతం గుర్తు పెట్టు బద్దశత్రువుల్లా తలపడి, కలబడి, ఘర్షించే క్రికెటర్ల మధ్య సాగే ఆట మొహాలీలో సోమవారం రాత్రి ప్రత్యర్థులను కలిపింది. క్రీడాకారులను కలిపింది. ఒక క్రీడగా క్రికెట్‌ను ఒకటి చేసింది. ఈ మహత్తర క్షణంలో క్రికెట్ అంటే 11 మంది వెధవలు ఆడుతుండగా, 11 వేలమంది వెధవలు చూసే ఆటగా వందేళ్ల క్రితం జార్జి బెర్నార్డ్‌షా చేసిన కామెంట్ గాల్లో కలిసిపోయినట్లయింది.

IPL Final 2023| భారత్ ప్రపంచ కప్ గెలిచిన క్షణాలను రేడియో కామెంటరీ ద్వారా విన్నాం 1983 ప్రుడెన్షియల్ కప్‌లో భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన క్షణాలను మా ఊరిలో అన్నదమ్ముల సమక్షంలో అర్ధరాత్రి పూట రేడియో కామెంటరీ ద్వారా వింటూ మహదానందానుభూతిని స్పర్శించిన బాల్యం నాది. అజేయంగా కనిపించిన వెస్టిండీస్ జట్టు ఫైనల్లో భారత్ చేతిలో ఒక్కో వికెట్ కోల్పోతున్నప్పుడు వివియన్ రిచర్డ్స్ ఒక్కసారిగా మైదానంలోకి అడుగుపెట్టి పులిలాగే ఫోర్లు బాదుతూ మ్యాచ్‌ని లాగేసుకుంటున్న క్షణంలో రిచర్డ్ క్యాచ్‌ను పట్టిన భారత జట్టు ఆ క్షణంలోనే ప్రపంచ కప్‌ని లాగేసుకున్నంత పనిచేసింది. ఆ తర్వాత జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల తర్వాత ఈ సోమవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని టీవీలో కాదు. ల్యాప్‌టాప్‌లో చూస్తూ అదే మహదానుభూతిని పొందాను. ఏ క్రీడలోనైనా సరే… చరిత్ర సృష్టించిన రెండు అపురూప క్షణాలకు నేను సాక్షీభూతుడినయ్యాను. (2011లో ఇండియా రెండోసారి ప్రపంచ కప్ గెల్చుకున్నప్పుడు చందమామలో పనిచేస్తూ ఇంటికి లేటుగా రావడంతో తొలి సగం ఆటను చూడలేకపోయాను. అదొక అర్ధానుభూతి అని చెప్పవచ్చు.) క్రికెట్‌లో ఏముందనవచ్చు. బిలియనీర్ల సంపదను పెంచుతున్న వ్యాపార క్రీడ అయిపోయింది కదా అని తీసిపారేయవచ్చు. కానీ 50 ఏళ్లకు ముందు పల్లెటూరులో ఉండగానే మా కుటుంబాలను అంటుకుపోయిన గేమ్ అది. ఎలా మరవాలి. ఎందుకు మరవాలి?

మూడు ముక్కల్లో ఆట

ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా, సీఎస్‌కే జట్టు నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా చివరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్‌కేను గెలిపించాడు.

Read Also:
1. బయటకు రావొద్దు.. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....