టీమిండియా స్టార్ బ్యాటర్స్‌లో ఒకడైన రాహుల్(KL Rahul) ఈసారి ఐపీఎల్ మెగా వేలంలోకి అడుగుపెట్టాడు. గత సీజన్‌లో లక్నో సూపర్ జయింట్స్ జట్టును సారథ్యం వహించిన రాహుల్.. ఒక్కసారిగా మెగా వేలంలోకి ఎందుకు అడుగుపెట్టాడనేది ఆసక్తికరంగామారింది. రాహుల్‌ను రిటైన్ చేసుకోవడానికి లక్నో ఆసక్తి చూపినప్పటికీ రాహుల్ మాత్రం ఆ జట్టులో కొనసాగడానికి ఇంట్రస్ట్ చూపలేదు. అయితే గత సీజన్‌లో సన్‌రైజర్స్‌పై అత్యంత చిత్తుగా లక్నో ఓడిపోవడంపై ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా(Sanjiv Goenka).. బహిరంగా రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇప్పుడు జట్టును వీడాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. తాజాగా రాహుల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రాహుల్ స్పందించాడు.
కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నానని, తన ఆట ఆడటానికి స్వేచ్ఛ కావాలని, అందుకే లక్నో(LSG) నుంచి తప్పుకున్నానని పేర్కొన్నాడు. జట్టు వాతావరణం తేలికగా ఉండి ప్లేయర్‌కు కొంత స్వేచ్ఛ లభించే టీమ్ తరపున ఆడాలని తాను అనుకుంటున్నానని వివరించాడు. ‘‘నేను కొంత కాలం టీ20 జట్టుకు దూరంగా ఉన్నాను. ఆటగాడిగా నేనెక్కడ సరిపోతానో నాకు బాగా తెలుసు. తిరిగి జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసు. రానున్న ఐపీఎల్(IPL) సీజనే అందుకు వేదిక. మళ్ళీ భారత జట్టులో స్థానం సంపాదించి నా ఆటను ఆస్వాదిస్తా. టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి రావడమే నా లక్ష్యం’’ అని వివరించాడు రాహుల్(KL Rahul ).