ప్రపంచ స్టార్ ఫుట్‌బాలర్స్‌లో ఎంబెప్పే(Kylian Mbappe) ఒకడు. తాజాగా అతడు ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మెస్సీ(Lionel Messi)ని కించపరిచేలా ఎంబెప్పే పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఎంబెప్పేపై మెస్సీ అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాకుండా ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్స్ మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ, టొటెన్‌హమ్ హాట్‌స్పుర్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎంబెప్పే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌లు పెట్టారు. ఇవి కాస్తా తీవ్ర వివాదానికి దారి తీయడంతో వీటిపై ఎంబెప్పే స్పందించాడు. తాను ఎన్నడూ అలాంటి పోస్ట్‌లు పెట్టలేదని, పెట్టను అని అన్నాడు. తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైందని, గుర్తు తెలియని వ్యక్తులు తన పేరిట ఇలాంటి పోస్ట్‌లు పెట్టారని వివరణ ఇచ్చాడు. అనంతరం ఏది ఏమైనా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో వచ్చి పోస్ట్‌ల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారందరికీ క్షమాపణలు చెప్పారు.
ఎంబెప్పే(Kylian Mbappe) పోస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)ను ప్రశంసిస్తూ మెస్సీని కించపరిచారు. ‘‘క్రిస్టియానో రొనాల్డో ఆల్‌టైమ్ దిగ్గజ ఆటగాడు. ఈ చిన్న వ్యక్తిలా కాదు’’ అంటూ కింద లియొనాల్ మెస్సి ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ పోస్ట్‌లను తొలగించినప్పటికీ అప్పటికే ఇవి బాగా వైరల్ కావడంతో వివాదం చల్లారడం లేదు.